Begin typing your search above and press return to search.

తెలంగాణ రాజకీయాల్లో తమిళ నటుడు

By:  Tupaki Desk   |   28 Jan 2023 2:53 PM GMT
తెలంగాణ రాజకీయాల్లో తమిళ నటుడు
X
ప్రముఖ తమిళ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.

అయితే కవితతో చర్చించిన శరత్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ నడుస్తోంది. శరత్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కూడా కనిపిస్తోందని అంతా అనుకుంటున్నారు.

ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు సీనియర్ నేతలు, పార్టీలతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చేపట్టాల్సిన చర్యలపై మాట్లాడుతున్నారు. ఈ సమయంలో కవితతో.. శరత్ కుమార్ బేటీ కావడంతో అందరి చూపు అటువైపు పడింది. అయితే వీరి భేటీ సాధారణ భేటీనా లేక రాజకీయ కోణంలోనే జరిగిందా అనే విషయంపై అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఏం తెలియదు.

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించే పనుల్లో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణకు సంబంధించిన విషయాల్లో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత కూడా కీలక బాధ్యతలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే కవిత శరత్ కుమార్ తో బేటీ కావడంపై.. తమిళనాడులో కూడా బీఆర్ఎస్ విస్తరణ వ్యూహాలు ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. బీఆర్ఎస్ లో పని చేసేందుకు శరత్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కేవలం తమిళనాడులో కాకుండా ఒడిశాలో కూడా బీఆర్ఎస్ వైపు పలువురు నేతలు మొగ్గు చూపారు. సీనియర్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి గమాంగ్ ఫ్యామిలీతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో గిరిధర్ కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గిరిధర్ తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు నలుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.