Begin typing your search above and press return to search.

వెంకయ్యను దిగ్గజ నటుడితో పోల్చిన తమిళ ఎంపీ.. సరైన పోలికే

By:  Tupaki Desk   |   9 Aug 2022 9:30 AM GMT
వెంకయ్యను దిగ్గజ నటుడితో పోల్చిన తమిళ ఎంపీ.. సరైన పోలికే
X
తెలుగు చలన చిత్ర నటుల్లో ఎస్పీ రంగారావుది ప్రత్యేక స్థానం. "ఎస్పీ రంగారావు తెలుగువారిగా పుట్టడం మన గుడ్ లక్. ఆయనకు బ్యాడ్ లక్" అని అంటారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తనదైన శైలిలో నటించారు ఎస్వీఆర్. ఊరిలో పెద్ద మనిషి.. కుటుంబంలో ఇంటి పెద్ద.. పిల్లలకు తాతయ్య.. అన్నీ ఆయనే. పాత్రలకే చాలెంజ్ విసిరిన స్థాయి ఎస్వీఆర్ ది. ధుర్యోధనుడి అభిజాత్యం, రావణుడిలో భీకరం, ఘటోత్కచుడిలోని చతురత, కంసుడి క్రూరత్వం, కీచకుడిలోని జిత్తులమారితనం, భీష్ముడిలోని ఔచిత్యం అన్నిటినీ అలవోకగా పండిచేవారు ఎస్వీఆర్.

అందుకే ఆయనను నట యశస్వి అనేవారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తెలుగు వారు ముప్పవరకు వెంకయ్య నాయుడును తమిళ ఎంపీ తిరుచ్చి రవి.. ఎస్వీ రంగారావుతో పోల్చారు. వెంకయ్య పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. సోమవారం ఆయనకు రాజ్య సభ చైర్మన్ గా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తిరుచ్చి రవి.. వెంకయ్య గురించి మాట్లాడుతూ, ఆయనను చూస్తుంటే ఎస్వీ రంగారావును చూస్తున్నట్లే ఉంటుందని అనడం విశేషం.

రూపం.. వాచకం..ఎస్వీ రంగారావు అంటేనే వాచకం. పౌరాణిక తెలుగు సినిమాల్లో అనర్గళంగా ఆయన చెప్పే డైలాగులు విని తీరాల్సిందే. ఓ ప్రవాహంగా సాగిపోతుంది ఆయన డైలాగ్ డెలివరీ. ఇక జానపద, సాంఘిక చిత్రాల్లోనూ ఎస్వీఆర్ చెప్పిన డైలాగులు ఎంతటి పాపులరో అందరికీ తెలిసిందే. అందుకే ఆయనను విశ్వ నట చక్రవర్తి అనేవారు. 1964లోనే జకార్తా ఆఫ్రో - ఆసియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న స్థాయి ఆయనది. టాలీవుడ్ క్లాసిక్ నర్తన శాలలో కీచకుడిగా ఎస్వీఆర్ కనబర్చిన నట విశ్వరూపానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఆయన నట యశస్వి, నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి అయ్యారు. ఇక 1918 జూలై 3న నూజివీడులో జన్మించిన ఎస్వీఆర్.. 56 ఏళ్ల వయసులో 1976 జూలై 18న చనిపోయారు.

తమిళులకూ ఇష్టుడే ఎస్వీ రంగారావు తెలుగు నటుడే కాదు.. తమిళంలోనూ చాలా చిత్రాల్లోనూ నటించారు. ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమ పూర్తిగా చెన్నైలోనే ఉండేది. దీంతో తెలుగు నటులు తమిళ సినిమాల్లోనూ చేసేవారు. సహజ ప్రతిభావంతుడైన ఎస్వీఆర్ అలా తమిళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రజల మెప్పు పొందారు. తమిళ ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ సీఎం ఎంజీఆర్ వయస్కుడైన ఎస్వీఆర్.. మరికొన్నాళ్లు జీవించి ఉంటే.. నటుడిగా మరింత ఎత్తుకు ఎదిగేవారని అందరూ అనేమాట.

వెంకయ్య భాష.. యాస.. ప్రాస ప్రస్తుతం ఉన్న తెలుగు నాయకుల్లో భాష గురించి ఎక్కువగా ప్రస్తావించేది, ప్రేమించేది వెంకయ్యనాయుడు. తెలుగంటే ఆయనకు అమితాభిమానం. అంతేకాదు తెలుగులో అనర్గళంగా సాగే ఆయన ప్రసంగం అత్యంత ఆకట్టుకుంటుంది. వెంకయ్య ప్రాస.. ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాదు.. హిందీ, ఇంగ్లిష్ లోనూ ప్రాసలతో ప్రసంగించడం వెంకయ్యనాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాత తెలుగులో బహుశా ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రసంగించగల నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో?

ఇద్దరికీ పోలిక..స్పష్టాతి స్పష్టమైన వాచకంలోనే కాదు.. రూపం చూస్తే.. వెంకయ్య నాయుడు నట యశస్వి ఎస్వీఆర్ లా ఉంటారు. అందుకే తిరుచ్చి శివ ఆయనను ఎస్వీఆర్ తో పోల్చారు. మరోవైపు నాలుగేళ్ల కిందట హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. నాడు ఆయన చేసిన ప్రసంగం ఎప్పటిలానే ఓ ప్రవాహంలా సాగింది. ఇక పోతే తిరుచ్చి శివ పార్లమెంటులో చురుగ్గా ఉంటారు. ఆయన లేవనెత్తే అంశాలు కీలకమైనవి అయి ఉంటాయి.