Begin typing your search above and press return to search.

దేశాన్ని అతలాకుతలం చేసిన పెద్ద మనిషి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడా?

By:  Tupaki Desk   |   2 April 2020 5:30 AM GMT
దేశాన్ని అతలాకుతలం చేసిన పెద్ద మనిషి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడా?
X
ప్రపంచంలోని పలు దేశాల ఊసురు తీసిన కరోనా భారత్ విషయానికి వస్తే.. ప్రభావం తక్కువగా ఉందన్న ప్రశంసతో పాటు.. ముందస్తుగా తీసుకున్న చర్యలపై నిన్నటి వరకూ అభినందించిన వారే.. ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. కరోనా వేళ.. ఏ చిన్నపొరపాటు జరిగినా మూల్యం భారీగా చెల్లించాలన్న నానుడికి తాజాగా ఢిల్లీలోని మర్కజ్ ఉదంతాన్ని ఎత్తి చూపిస్తున్నారు.

కసిగా కాటు వేసే కరోనా కోరలకు చిక్కుండా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్న వేళ.. వేలాది మందితో ఇంతటి సదస్సును అదీ దేశ రాజధానిలో ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశం మొత్తం పరిమితుల చట్రంలో ఉండిపోతే.. మర్కజ్ లో బస చేసిన వందలాది మంది ఖాళీ చేయాల్సి వస్తే.. అందుకు ససేమిరా అన్న వైనం కొత్తగా బయటకు వచ్చింది. మర్కజ్ లో వందలాదిగా ఒకేచోట ఉన్నారు. ఇదేమాత్రం మంచిది కాదన్న మాట ఎంత చెప్పినా తగ్లీబ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ససేమిరా అనటం దేనికి నిదర్శనం?

ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వారిని చితక్కొట్టేసే పోలీసులు.. ఇలాంటి వ్యవహరాల్లో చూసిచూడనట్లుగా వ్యవహరించటాన్ని ఏమని చెప్పాలి. ఈ రోజున దేశానికే ముప్పుగా మారిన వీరి వైఖరితో.. కరోనా పాజిటివ్ ల సంఖ్య ఒక్కసారిగా మారిపోవటమే కాదు..దేశ వ్యాప్తంగా వీరి ప్రభావానికి గురి కావటాన్ని ఏమని చెప్పాలి? ఎంత చెప్పినా మాట వినకపోవటంతో.. చివరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ రంగంలోకి దిగిన తర్వాతే మర్కజ్ ప్రాంతాన్ని ఖాళీ చేయటానికి ఒప్పుకున్న మొండితనాన్ని ఏమని చెప్పాలి?

ఇండోనేషియా నుంచి మర్కజ్ సమావేశాలకు వచ్చిన పదిమందికి కరోనా పాజిటివ్ అన్న సంగతి మార్చి 18న నిర్దారణ అయింది. తెలంగాణలోని కరీంనగర్ లో పర్యటిస్తుండగా విషయం వెలుగు చూడటం.. ఆ తర్వాతి రోజే ఢిల్లీ కనెక్షన్ మీద రియాక్ట్ అయిన కేంద్రం అన్నిరాష్ట్రాలను అలెర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.మర్కజ్ నిజాముద్దీన్ లో ఉన్న దాదాపు పదిహేను వందల మందిని గుర్తించి.. అతి కష్టమ్మీదా వారిని ఖాళీ చేయించాల్సి వచ్చిందంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోటానికి కారణమైన తగ్లీబ్ జమాత్ చీఫ్ ఎక్కడ? ఏం చేస్తున్నారు?

అతనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆశ్చర్య కరమైన విషయం బయటకు వస్తుంది.

తన కారణంగా దేశం పెను ప్రమాదంలోకి జారిపోతే.. అందుకు బాధ్యత వహించి.. తనకు తానుగా ముందుకు వచ్చి.. చేసిన తప్పునకు క్షమాపణలు కోరి..తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరితే.. ఎంత బాగుండేది? అధ్యాత్మిక బోధనలు చేసి.. మరింత మెరుగైన సమాజం కోసం నిజంగా పాటు పడే పక్షంలో.. అందరికి ఆదర్శంగా నిలిచి ఉంటే తగ్లీబ్ జమాత్ పెద్ద మనిషిని గొప్పగా చెప్పుకునేవారు. ఆయన కారణంగా ఈ రోజు దేశ ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లిన పరిస్థితి.

ఇలాంటి వేళ.. పెద్దరికాన్ని ప్రదర్శించటం మానేసి.. కనిపించకుండా పోయిన తీరు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ మహానుభావుడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన విషయాన్ని గుర్తించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తగ్లీబ్ ఎపిసోడ్ కారణంగా విపరిణామాలు చోటు చేసుకున్న పిమ్మట.. ఇందుకు కారణమైన ఆరుగురి మీద తాజాగా ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద కేసులు పెట్టారు. మరింత దారుణమైన విషయం ఏమంటే.. మార్చి 24న నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మర్కజ్ కు సందర్శకులు వస్తూనే ఉన్నట్లుగా ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు. మరి.. కఠిన చట్టాలు ఏం చేస్తున్నట్లు? ఇంతకీ తగ్లీబ్ జమాత్ పెద్ద మనిషి ఎక్కడున్నట్లు? ఏం చేస్తున్నట్లు? ఎవరు రక్షణ ఇస్తున్నట్లు?