Begin typing your search above and press return to search.

న్యాయ వ్యవస్థ మీద డిబేట్లు పెట్టి వారికి ఏదైనా ఆపాదించవచ్చా?

By:  Tupaki Desk   |   28 May 2023 11:07 AM GMT
న్యాయ వ్యవస్థ మీద డిబేట్లు పెట్టి వారికి ఏదైనా ఆపాదించవచ్చా?
X
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హై కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ తరఫున లాయర్ వినిపించిన వాదనలు చూస్తే చాలా కొత్త సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. హై కోర్టు న్యాయమూర్తి అడిగిన అనేక ప్రశ్నలకు సీబీఐ లాయర్ నుంచి సమాధానాలు ఇచ్చే క్రమంలో తడబడాల్సి వచ్చింది.

ఈ కేసు నాలుగేళ్లుగా నత్తనడకగా సాగుతోంది. దాని మీదనే కోర్టు న్యాయమూర్తి ప్రశ్నలను సంధించినట్లుగా ఉంది. అదే విధంగా చూస్తే ఈ కేసులో మొదట సాక్షిగా తరువాత నిందితుడిగా అవినాష్ రెడ్డి మారారు. ఇపుడు ఆయనే కీలకం అన్నట్లుగా దర్యాప్తు సాగుతోందని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈ కేసులు సంబంధించి హై కోర్టు తీర్పుని జూన్ ఫస్ట్ కి వాయిదా వేసింది. అయితే దాని మీదనే ఇపుడు డిబేట్లు సాగుతున్నాయి. నిజానికి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థ ఉంది. ప్రజాస్వామ్య సౌధానికి అది ఒక కీలక స్థంభం. ఇంకా చెప్పాలంటే ముఖ్యమైన పిల్లర్. అలాంటి న్యాయ వ్యవస్థ మీద తీర్పుల మీద అసహనం వ్యక్తం చేయడం ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. ఇది మేధావితనం అనిపించుకంటే అనిపించుకోవచ్చు కానీ సగటు ప్రజలకు ఏ రకమైన సందేశాన్ని తీసుకెళ్తుందో అర్ధం చేసుకోవాలి.

ఈ రోజుకీ ఈ దేశం ఇలా సాఫీగా సజావుగా సాగుతోంది అంటే దానికి కారణం వ్యవస్థల మీద సాధారణ ప్రజలకు నమ్మకం అపారంగా ఉండడమే. ఈ రోజుకీ ప్రజలు వాటిని బలంగా నమ్ముతారు. అయితే అన్నింటా చొచ్చుకువచ్చిన రాజకీయం కాస్తా ఇపుడు న్యాయ వ్యవస్థ మీద కూడా రాళ్ళేయాలని చూస్తోంది.

ఇక మీడియాకు రాజ్యాంగం లో అందరికీ ఉన్న భావ ప్రకటన స్వేచ్చ హక్కులే ఉన్నాయి. కానీ తాము అతీతులమని భావిస్తూ హద్దు దాటి దేశంలోని కీలకమైన వ్యవస్థల మీద కామెంట్స్ చేస్తూ రావడం కూడా బాధాకరం. విషయానికి వస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని తెలంగాణా హై కోర్టు వెకేషన్ బెంచ్ విచారిస్తోంది.

ఇందులో భాగంగా అన్ని వైపున నుంచి వాదనలను న్యాయమూర్తి సుదీర్ఘ విచారణ సందర్భంగా విన్నారు తీర్పుని బుధవారానికి వాయిదా వేశారు. ఈ లోగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు అంటూ సీబీఐని ఆదేశించారు. ఇది న్యాయ ప్రక్రియలో ఒక భాగం. అసలు దీని మీద డిబేట్ పెట్టవచ్చా అన్నది ఒక పాయింట్ అయితే అక్కడ చర్చలలో పాలు పంచుకున్న వారు ఏకంగా న్యాయ వ్యవస్థ మీదనే అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడాలి అన్నదే చర్చగా ఉంది.

దీని మీద ఒక చానల్ నిర్వహించిన డిబేట్ లో కొందరు ప్యానలిస్ట్ లు చేసిన కామెంట్స్ ఇపుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిజానికి రాజ్యాంగం ప్రకారం చూస్తే ఒక కోర్టు తీర్పు మీద మరో కోర్టు లో అప్పీలుకు వెళ్తే కొట్టేయడంలో లేదా సమర్ధించడంలో జరుగుతుంది. అంతే కానీ ప్రతీ కోర్టు స్వతంత్రంగానే నా వ్యవహరిస్తుంది. హై కోర్టు విషయం తీసుకుంటే తన ముందు ఉన్న వాదనలను బట్టి మెరిట్స్ డీ మెరిట్స్ చూసుకుని న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు.

దాన్ని తప్పు పట్టేందుకు అతి ఉత్సాహం ఎవరైనా చేయడం సరికాదు అని అంటున్నారు. అంతే కాదు తుది తీర్పు ఇంకా న్యాయమూర్తి ఇవ్వలేదు. దానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఇంతలోనే ఆగలేకపోతే ఎలా. అయినా న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పుల మీద ఇంతటి అసహనం అది కూడా బాహాటంగా వ్యక్తం చేయడం కచ్చితంగా కోర్టు ధిక్కరణే అని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీర్పులు వచ్చినపుడు న్యాయ వ్వవస్థ గొప్పది, న్యాయం ధర్మం గెలిచింది అని ఢంకా భజాయించి ఇవే ఎల్లో చానళ్ళు ప్రసారం చేస్తూ ఉంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఈ తీర్పు చెంప పెట్టు అంటాయి. మరి ఇపుడు తీర్పు కూడా రాలేదు. జస్ట్ ఒక ఆదేశం వచ్చింది. తీర్పు సారాంశం ఏంటో చూడకుండా రెచ్చిపోవడం అంటే ఈ తరహా రాజకీయాలతో వ్యవస్థల మీద బురద జల్లే హక్కు ఎవరు ఇచ్చారు అన్నది ప్రశ్న.

అసలు అలా చేయవచ్చా. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద డిబేట్లు పెట్టి వారికి ఏదైనా ఆపాదించవచ్చా. అసలు మీడియా పరిధి ఏమిటి. ఎంత దాకా అది మాట్లాడవచ్చు. ప్యానలిస్టులు అన్నిటికీ అతీతులా. వారికి ఈ దేశంలో రాజ్యంగ నియమాలు పట్టవా ఇవన్నీ రేకెత్తిస్తున్న ప్రశ్నలు.

ఏది ఏమైనా రాజకీయం ఇంతలా హోరా హోరీగా ఏపీలో సాగడం ఒక ఎత్తు అయితే ఏకంగా న్యాయ వ్యవస్థనే నిందించే స్థాయిలో ఉండడాన్ని ఏ మాత్రం ఉపేక్షించకూడన్న సలహా సూచనలు మేధావుల నుంచి వస్తున్నాయి. కోర్టు తీర్పుల మీద డిబేట్లు నిర్వహించే క్రమంలో పరిధిలు మీరుతున్న వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా వస్తోంది.