Begin typing your search above and press return to search.

కేసీఆర్ నియంతే..ఈ అరెస్టులే సాక్ష్యం

By:  Tupaki Desk   |   17 Nov 2019 4:02 PM GMT
కేసీఆర్ నియంతే..ఈ అరెస్టులే సాక్ష్యం
X
టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమకారుడిగానే మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆయనలో ఓ నియంత కనిపిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి ఉద్యమం సాగించిన కేసీఆర్... నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాల నియంతృత్వ ధోరణులను ఏ స్థాయిలో ఎండగట్టారో తెలిసిందే. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం, ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్... ఇప్పుడు తన సెకండ్ టెర్మ్ పాలనలో తానెంత కఠినాత్ముడినన్న విషయాన్ని ఇట్టే బయటపెట్టేసుకున్నారని చెప్పక తప్పదు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా మరిన్ని డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టగా.. కేసీఆర్ తనదైన శైలి కరకు వైఖరితో ముందుకు సాగుతున్నారు. కార్మిక సంఘాలతో చర్చలకు ససేమిరా అన్న కేసీఆర్... కోర్టు ఆదేశాలతో కాస్తంత వెనక్కు తగ్గినట్టే కనిపించినా... ఆదివారం నాడు కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేసిన తీరుతో సమ్మెపై తానెంత మాత్రం తగ్గలేదని - మునుపటి కంటే కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తున్నానని కేసీఆర్ చెప్నపనే చెప్పేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తమ డిమాండ్ల పరిష్కారం పక్కనపెట్టి... కనీసం తమతో చర్చలు జరపాలని కార్మిక సంఘాలు చెప్పినా... కేసీఆర్ కొంతైనా పట్టు వీడలేదనే చెప్పాలి. తాము ఓ మెట్టు దిగినా... సర్కారు ఇంకా కఠినంగా వ్యవహరించిన తీరుతో కార్మిక సంఘాల నేతలు తమ తమ గృహాల్లోనే దీక్షలకు దిగారు. ఈ దీక్షలపై కేసీఆర్ నిజంగానే కన్నెర్రజేశారు. పోలీసులను రంగంలోకి దించి ఇళ్లల్లోనే దీక్షలు చేస్తున్న కార్మిక సంఘాల నేతలు అశ్వత్థామరెడ్డి - రాజిరెడ్డిలను బలవంతంగా ఆసుపత్రులకు తరలించేశారు. ఈ సందర్బంగా చోటుచేసుకున్న ఘటనలను చూస్తే... కేసీఆర్ నిజంగానే నియంతలా మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కార్మిక సంఘం నేతల అరెస్ట్ ల సందర్భంగా ఏం జరిగిందన్న విషయానికి వస్తే... గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్‌ లోని రెడ్డి కాలనీలో ఆయన ఇంటి తలుపులను రాళ్లతో పగలగొట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే... నిరాహారదీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వివేక్‌ - జితేందర్‌ రెడ్డి - రామచంద్రరావు తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో వివేక్‌ - జితేందర్‌ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. మొత్తంగా తాను ఉక్కుపాదం మోపదలచుకుంటే... ఎలా ఉంటుందో కేసీఆర్ ఈ చర్యతో చెప్పకనే చెప్పేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.