ఉప ఎన్నిక ఒకటుందని కేసీఆర్ మర్చిపోయారా?

Wed Oct 09 2019 12:47:12 GMT+0530 (IST)

TSRTC Employees Strike Effect on TRS Party over Huzur Nagar Bypolls

సమస్యలన్ని కట్టకట్టుకొని వచ్చి మీద పడినట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయాన్ని కటువుగా డీల్ చేసే కన్నా.. సున్నిత అంశంగా తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నిక ఫలితం సానుకూలంగా రావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కేసీఆర్ తరచూ గుర్తు పెట్టుకొని ఉంటే మంచిందంటున్నారు.ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరిగిపోయే అధికారపక్ష అధినేతకు.. ఎదుటి వారి శక్తిసామర్థ్యాల మీద కంటే తన మీద తనకు నమ్మకం విపరీతంగా ఉంటుంది. తెలంగాణ సాధన లాంటిది సాధ్యం చేసిన కేసీఆర్ కు ఏదైనా తక్కువే. ఎవరైనా తలొగ్గాలన్నది కాలానికి అనుగుణంగా మారుతుందన్నది మర్చిపోకూడదు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ అధికారపక్షానికి అనుకూలంగా రావాల్సిన అవసరం చాలా ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ సారు.. కారు.. పదహారు నినాదం అట్టర్ ప్లాప్ కావటం.. ఆ షాక్ నుంచి బయటకు రావటానికి గులాబీ బ్యాచ్ కు చాలాకాలమే పట్టిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ రాజకీయ సమీకరణాల్ని మార్చే అవకాశం ఉన్న ఉప ఎన్నిక విషయంలో అవసరానికి మించిన అప్రమత్తత చాలా అవసరం. అయితే.. తాజాగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇష్యూను అంతకంతకూ పెంచేయటం ద్వారా.. కేసీఆర్ ఆ అంశం మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె ఎపిసోడ్ కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయ ప్రభావం అంతో ఇంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయ్యే సమయంలో హుజూర్ నగర్ లో అధికారపక్షానికి ఉన్న సానుకూలత.. రోజులు గడిచే కొద్దీ తగ్గిపోతుందన్న గులాబీ నేతల మాట వింటే.. పరిస్థితిలో తేడా వచ్చిందన్న విషయం అర్థం కాక మానదు. సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చేసినట్లు ఇప్పటికే వెలువడిన ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో తన శక్తిసామర్థ్యాలన్ని సమ్మె మీద పెడితే.. హుజూరా బాద్ ఉప ఎన్నిక సంగతేంటి? అన్నది ప్రశ్నగా మారింది. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది కాలమే చెప్పాలి.