Begin typing your search above and press return to search.

ఢిల్లీతెలంగాణ భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నాన్ని ఏమంటారు?

By:  Tupaki Desk   |   3 Jun 2023 10:08 AM GMT
ఢిల్లీతెలంగాణ భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నాన్ని ఏమంటారు?
X
డైలీ బేసిస్ లో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నీతులు చెప్పే అలవాటున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముందుంటారు. నిత్యం ఆయన కేంద్రంలోని మోడీ సర్కారుపై సెటైర్లు సంధిస్తుంటారు. ప్రతి అంశాన్నిప్రస్తావిస్తూ ప్రశ్నిస్తుంటారు. ఇంత యాక్టివ్ గా ఉన్న పెద్దమనిషి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మీద లైంగిక వేధింపుల అంశంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చి.. మీడియాలోనూ ప్రముఖంగా వచ్చిన ఉదంతంపై చర్యలు తీసుకోవాలిగా? ఒకవేళ తమ ఎమ్మెల్యే తప్పు లేకపోతే.. ఆ విషయాన్నిఅయినావెల్లడించాలి కదా?

అదేమీ చేయకుండా.. తమకేమీ కనిపించనట్లు.. వినిపించనట్లుగా వ్యవహరించే తీరు విస్మయానికి గురి చేస్తుంటుంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఆరిజన్ డెయిరీకి చెందిన భాగస్వామి శైలజ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీనిపై ఆమె కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు. రెండు.. మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన ఆమె.. జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరు కావటమేకాదు.. తనకు న్యాయం జరుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు.

అంతలో ఏమైందో కానీ.. ఆమె తాజాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సం వేళ.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట ఆత్మహాత్యాయత్నం చేసుకున్నారు. విషం తాగిన ఆమె.. తాను సూసైడ్ చేసుకోవటానికి ముందు.. తనను ఎమ్మెల్యే దుర్గంచిన్నయ్య వేధిస్తున్నారని.. ఆయన అనుచరులు భీమా గౌడ్.. సంతోష్.. పోచన్న.. కార్తీక్ లు మానసికంగా హింసిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవటంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

తనను సోషల్ మీడియాలో అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని.. తాను మానసికంగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు. ఈ అవమానాన్నిభరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన సమస్య గురించి పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదన్న ఆమె.. తన సూసైడ్ లెటర్ లో తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టార్ రెజ్లర్లను లైంగికవేధింపులకు గురిచేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నబీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ట్వీట్ చేసి చర్యల కోసం డిమాండ్ చేసిన మంత్రి కేటీఆర్.. తమ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు స్పందించనట్లు? ఇదేం న్యాయం కేటీఆర్?