Begin typing your search above and press return to search.

విలేకరుల్ని పిలిచి విమర్శించే బదులు.. మోడీని నిలదీస్తే ఏమవుతుంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   28 May 2023 10:00 AM GMT
విలేకరుల్ని పిలిచి విమర్శించే బదులు.. మోడీని నిలదీస్తే ఏమవుతుంది కేసీఆర్?
X
తప్పును తప్పుగా ఎత్తి చూపటం.. న్యాయమైన డిమాండ్లను అధికారిక వేదికల మీద గళం విప్పటం తప్పేం కాదు. రాజకీయాల్లో ఆ మాత్రం ముక్కుసూటితనం లేకపోవటం ఏమిటి? చట్టబద్ధమైన వేదికల మీద తప్పులు చేస్తున్న తీరును ఎండగట్టాల్సిన అవసరం ఉంది కదా? అందుకు మోడీనే మంచి ఉదాహరణ. ప్రెస్ మీట్లు పెట్టేసి.. నానా రచ్చ చేసే బదులు.. అంతర్జాతీయ వేదికల మీద భారత్ కు జరుగుతున్న అన్యాయంపై మోడీ మాట్లాడే వైనానికి దేశ ప్రజలు ఎంతలా ఫిదా అవుతున్నారన్న దానికి నిదర్శనంగా జీ7 దేశాల సదస్సు నిదర్శనంగా చెప్పొచ్చు.

మరి.. మోడీ తీరునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి అధినేతలు ఎందుకు ప్రదర్శించరు. మీడియా భేటీలు పెట్టేసి.. తమకు మించిన తెలివి మరెవరికీ ఉందన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయటంతోపాటు.. కేంద్రం చేస్తున్న తప్పుల్ని అదే పనిగా చెప్పే ఆయన.. నీతీ ఆయోగ్ లాంటి వేదికల మీదకు రాష్ట్రాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాల గురించి ఎందుకు ప్రశ్నించరు. కేంద్రం పక్షపాత ధోరణిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది కదా? బహిరంగ సభల్లో రాజకీయ విమర్శలు చేసే దానికి మించిన ప్రభావం.. ప్రధాని ఎదుట గొంతు విప్పితే ఆ లెక్కనే వేరుగా ఉంటుంది కదా? తప్పు చేసే కేంద్రం..న్యాయమైన అంశాలను నిలదీస్తే ఇరుకున పడే అవకాశం ఉంటుంది కదా?

అలాంటివి వదిలేసి.. ముఖం చాటేసినట్లుగా.. కీలక సమావేశాలకు హాజరు కాకుండా.. న్యాయమైన సమస్యల్ని ప్రస్తావించకుండా మీడియా భేటీలు ఏర్పాటు చేసి నాలుగు మాటలు అనేయటం వల్ల ఏమైనా లాభం ఉంటుందా? మోడీ లాంటి పవర్ ఫుల్ నేతను ఎదుర్కోవటానికి ముఖాముఖి పోరునే బాగుంటుంది. ఏ మాత్రం అవకాశం లభించినా నీతి బోధలు చేసే ఆయన తీరును.. ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఎందుకు నిలదీయకూడదు? ప్రశ్నించే అలవాటును ముఖ్యమంత్రులే వదిలేస్తే.. సామాన్యులకు ఇచ్చే సందేశం ఏముంటుంది?

తన కంటే అత్యంత బలహీనులైన మీడియా ప్రతినిధుల ముందు తన ఆగ్రహాన్ని ప్రదర్శించి.. లాజిక్కులతో కేంద్రాన్ని కడిగేసే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు.. ప్రధాని అధ్యక్షతన నిర్వహించే నీతీ ఆయోగ్ సమావేశాలకు హాజరై.. తమ రాష్ట్రం చేస్తున్న పనుల గొప్పతనం గురించి.. అదే సమయంలో కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల్ని ప్రశ్నిస్తే మరింత బాగుంటుంది కదా? అలాంటివెందుకు చేయరు కేసీఆర్? అడ్డం పొడుగు మాటలంటూ విరుచుకుపడే దమ్మును.. మోడీ ముఖాన ధైర్యంగా కడిగేస్తే మరింత బాగుంటుంది కదా?

దివంగత ప్రధాని ఇందిర బాటలోనే ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తున్నారని.. కేంద్రం అరాచకాలు మితిమీరుతున్నట్లుగా కేసీఆర్ విరుచుకుపడటం బాగుంది. అదేం తప్పు కాదు. ఆ మాటల్ని.. అంతే ఆగ్రహాన్ని.. ప్రధాని మోడీ ముందుకు వెళ్లి మాట్లాడి ఉంటే మరింత బాగుండేది కదా? కేసీఆర్ దమ్ము దేశానికి తెలీయటమే కాదు.. కోట్లాది మందికి స్ఫూర్తివంతంగా నిలిచేది కదా?