Begin typing your search above and press return to search.

కేసీఆర్ నేషనల్ ‘ఫ్యామిలీ’ పాలిట్రిక్స్

By:  Tupaki Desk   |   29 Jan 2023 5:00 PM GMT
కేసీఆర్ నేషనల్ ‘ఫ్యామిలీ’ పాలిట్రిక్స్
X
భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో తాజాగా ఒడిశాకు చెందిన మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కుటుంబ సమేతంగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. దీంతో గమాంగ్ తో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ లో చేరే నేతలంగా ఇతర పార్టీలు పక్కన పెట్టిన వారే. పార్టీని మోసం చేశారని గిరిధర్ గమాంగ్ ను కాంగ్రెస్ పక్కనబెట్టింది. ఇన్నాళ్లు అవకాశం కోసం ఎదురుచూసిన ఆయనకు బీఆర్ఎస్ రూట్ దొరికింది. మరోవైపు కుటుంబ పార్టీ అని ముద్ర వేసుకున్న వాళ్లే బీఆర్ఎస్ లో చేరుతున్నారన్న చర్చ కూడా సాగుతోంది. కర్ణాటకలోని జేడీఎస్, తాజాగా గిరిధర్ గమాంగ్ కుటుంబ పాలనతోనే గడపాలనుకుంటారు. ఇటు తెలంగాణలోనూ కేసీఆర్ అదే పద్ధతిని పాటిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అంటే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా నేషనల్ లెవల్లోనూ ‘ఫ్యామిలీ’ పాలిటిక్స్ చేయనున్నాడా..? అని అనుకుంటున్నారు.

కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ చేసే ప్రధాన ఆరోపణ కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలు అని. కాంగ్రెస్ వంశ పారపర్యంగానే పదవులు అనుభవిస్తారని కాషాయ నాయకులు నిత్యం విమర్శిస్తూ వస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లోకి వచ్చారని, వారి ప్రయోజనాలకే పార్టీని నడుపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కేసీఆర్ తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ మంత్రిగా, కుమార్తె కవిత ఎమ్మెల్సీగా, మేనల్లుడు హరీశ్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా, సోదరుడి కుమారుడు సంతోస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన కొన్ని పార్టీల పరిస్థితి కూడా అంతే. కర్ణాటక నుంచి బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న జేడీఎస్ పార్టీని దేవేగౌడ్ స్థాపించగా ప్రస్తుతం ఆయన కుమారుడు కుమారస్వామి అధ్యక్షుడిగా ఉన్నారు. మహారాష్ట్ర నుంచి మద్దతు ఇస్తున్న శివసేన పార్టీని బాల్ థాక్రే స్థాపించగా.. ఆయన కుమారుడు ఉద్దవ్ థాక్రే కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా ఒడిశా నుంచి బీఆర్ఎస్ లో చేరిన గిరిధర్ గమాంగ్ పరిస్థితి కూడా అంతే. ఆయన తన కుటుంబ సభ్యులందరితో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. అంటే భవిష్యత్ లో తమ కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వాలనే సంకేతాన్ని పంపారా..? అనిచర్చించుకుంటున్నారు.

ఒడిశాకు చెందిన మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పట్టుదల చూసి కాంగ్రెస్ అతడిని ప్రోత్సహించింది. అయితే గిరిధర్ గమాంగ్ సైతం కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తరువాత పార్టీని మోసం చేశారని కాంగ్రెస్ అతడిని పక్కనబెట్టింది. అలాంటి నేత ఇప్పుడు బీఆర్ఎస్లోకి రావడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అంతకుముందు ఏపీకి చెందిన చంద్రశేఖర్ రెడ్డి సైతం ఇతర పార్టీల నుంచి టిక్కెట్లు పొంది ఎక్కడా గెలవలేకపోయారు. కానీ బీఆర్ఎస్ కండువా కప్పుకొని వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.

జాతీయ రాజకీయాల్లో కొత్త మార్పులు తీసుకొస్తామని చెబుతున్న కేసీఆర్ ఇలా పేలలేని టపాసులను చేర్చుకొని విమర్శల పాలవుతున్నారు. ఇప్పుడు కుటుంబ పాలనకు ప్రిఫరెన్స్ ఇచ్చే నాయకులను చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ తెలంగాణలోనే కాకుండా దేశంలోనూ కుటుంబాలే పాలించేలా మార్పు తీసుకొస్తారా..? అని అనుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పై ఉన్న కుటుంబ పాలన ముద్ర చెరిపేసుకోవడానికి కొన్ని నెలల కిందట కర్ణాటకకు చెందిన మల్లిఖార్జు ఖర్గేకు జాతీయ అధ్యక్షుడి పదవిని కట్టబెట్టింది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇచ్చే వారిని ప్రోత్సహిస్తే ప్రజలు ఎలా ఆదరిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.