Begin typing your search above and press return to search.

అప్పుడేమో హెలికాఫ్టర్.. ఇప్పుడేమో ఏకంగా విమానం

By:  Tupaki Desk   |   30 Sep 2022 4:29 AM GMT
అప్పుడేమో హెలికాఫ్టర్.. ఇప్పుడేమో ఏకంగా విమానం
X
తానేం చేయాలనుకున్నా.. దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించటంతో పాటు..మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే విషయంలో ఆయనకు సాటి మరెవరూ రారనే చెప్పాలి. ఏం చేసినా లెక్కలు మిస్ కాకుండా ఉండే ఆయన.. దసరా పండుగ వేళ జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కీలక ప్రకటన చేస్తుండటం తెలిసిందే. దీనికి సంబంధించిన కసరత్తు ఓవైపు జోరుగా సాగుతున్న వేళలోనే.. రూ.100 కోట్ల ఖర్చుతోఒక విమానాన్ని కొనుగోలు చేసిన వార్త బయటకు వచ్చింది.

జాతీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తమదైన సొంత విమానంలో దేశ వ్యాప్తంగా టూర్లకు వెళ్లేలా ప్లానింగ్ జరగటం చూసినప్పుడు.. ఆయన ఎంత దీర్ఘంగా ఆలోచిస్తారో అర్థమవుతోంది.

అయితే.. ఇలాంటి తీరు ఆయనకు కొత్తేం కాదని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేతగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన వేళలో.. కేసీఆర్ మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. నిజానికి అదే ఆయనకు లాభించిందని చెప్పాలి. ఆ రోజుల్లోనే.. ఉద్యమ నేతగా వ్యవహరిస్తూ.. వివిధ ప్రాంతాల్లో తిరిగేందుకు వీలుగా హెలికాఫ్టర్ ఒకటి పార్టీ తరఫున కొనుగోలు చేయటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి.. దాని మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేని వేళ.. అందరి చూపు తన మీద పడేలా చేసేందుకు హెలికాఫ్టర్ కొనుగోలు చేసి ఉంటారన్న వాదన అప్పట్లో వినిపించేది. తాజాగా రూ.100 కోట్లు పెట్టి విమానాన్ని కొనుగోలు చేసిన వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. జాతీయ పార్టీ ఇంకా పెట్టింది లేదు. పార్టీ పేరును.. విధివిధానాల్ని ప్రకటించటానికి ముందే విమానం కొనుగోలు వెనుక అసలు విషయం ఏమిటి? అన్నది ప్రశ్న. దీనికి కేసీఆర్ సన్నిహితులు చెప్పే సమాధానం వింటే.. కేసీఆర్ మైండ్ సెట్ ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.

జాతీయ పార్టీ ఏర్పాటుకు భారీ బజ్ చాలా అవసరం. మోడీ మీద యుద్ధం ప్రకటించిన కేసీఆర్.. అందులో భాగంగానే ఆయన వేసే ప్రతి అడుగు ఉండనుంది. చాలామంది మాదిరి పేరుకు జాతీయ పార్టీ కాదని.. తాను ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నానన్న విషయం దేశ వ్యాప్తంగా అందరికి అర్థమయ్యేలా చేయటానికి ఏదో ఒకటి చేయాలి.

మిగిలిన వాటి కంటే కూడా వంద కోట్లు పెట్టి విమానం కొనటం చాలా ఈజీ. అందుకే.. ఆ పని చేయటం ద్వారా అందరిని ఆకర్షించటమే కాదు.. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ ఎంత సీరియస్ ప్రాజెక్టు అన్న విషయం ప్రజల్లోకి నేరుగా వెళ్లటానికి సాయం చేస్తుందని చెబుతున్నారు. ఏం చేసినా.. వెనుక బ్యాకప్ ప్లాన్ లేకుండా ముందుకు అడుగు వేయని కేసీఆర్.. వంద కోట్లు పెట్టి విమానాన్ని ఉత్తినే కొనరన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.