Begin typing your search above and press return to search.

‘భాగ్యలక్ష్మీ’ అమ్మవారే టీఆర్ఎస్ కు దిక్కా?

By:  Tupaki Desk   |   14 Jan 2021 8:00 AM GMT
‘భాగ్యలక్ష్మీ’ అమ్మవారే టీఆర్ఎస్ కు దిక్కా?
X
అది హైదరాబాద్ లోని ఎన్నో అల్లర్లు, మత కల్లోలాలకు కేంద్రమైన పాతబస్తీ. పక్కా మైనార్టీల ఏరియా.. అలాంటి ఏరియాలోనే ఉంది. ‘భాగ్యలక్ష్మీ’ అమ్మావారి ఆలయం.. అందునా చారిత్రక చార్మినార్ ను ఆనుకొని ఉంది. ఈ దేవాలయాన్ని ఇటీవల తెలంగాణలో గెలుపు రుచి చూసిన బీజేపీ సాంతం వాడుకుంది. ముస్లిం మైనార్టీల ఏరియాలోకి ఏకంగా తొడగొట్టి మరీ కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చి రాజకీయాన్ని రగిల్చారు. హిందుత్వ ఓటు బ్యాంకును గంపగుత్తగా లాగేసుకున్నారు. ఇక టీఆర్ఎస్ వ్యతిరేకులను ఆకర్షించారు.

బీజేపీ గెలుపునకు చార్మినార్ పాతబస్తీలోని ‘భాగ్యలక్ష్మీ’ ఆలయం ఎంతగానో ఉపయోగపడింది. రాజకీయంగా వారిని ఆదుకుంది. ఓటమి ఎదురయ్యాక కానీ టీఆర్ఎస్ ‘భాగ్యలక్ష్మి’ అమ్మవారి ఘనత, రాజకీయం అర్థం కాదు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా గులాబీ పార్టీ ‘భాగ్యలక్ష్మీ’ అమ్మవారిని ఓన్ చేసుకుంటోంది.

తాజాగా కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ‘భాగ్యలక్ష్మీ’ అమ్మవారి జపం చేశారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌లో జరిగిన భోగి వేడుకల్లో కవిత పాల్గొని భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా ఈ ఆలయం వార్తల్లో నిలిచింది. ముస్లిం ఆధిపత్య చార్మినార్ ప్రాంతంలో ఉన్నందున బిజెపి నాయకులు దీనిని తమ ప్రచారానికి కేంద్ర బిందువుగా మార్చారు.

భాగ్యలక్ష్మి ఆలయాన్ని విస్మరించడం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యే చేసిందని టిఆర్‌ఎస్ నాయకత్వం భావించింది. అందుకే భోగి వేడుకలకు కవిత భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఎంచుకొని ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.