కత్తులతో నరికి.. చేతులు ఎత్తుకుపోయి.. టీఆర్ఎస్ నేత తమ్మినేని దారుణ హత్య!

Mon Aug 15 2022 14:00:01 GMT+0530 (IST)

TRS leader Tammineni brutal murder!

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుసకు సోదరుడైన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం జిల్లా తెల్లారుపల్లిలో కృష్ణయ్యను ఆగస్టు 15న తెల్లవారుజామున దుండగులు దారుణంగా నరికి చంపారు. కత్తులు కొడవళ్లతో నరకడంతో తమ్మినేని కృష్ణయ్య అక్కడికక్కడే మరణించారు. మృతుడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేత తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడు.ఆగస్టు 15న ఖమ్మం రూరల్ మండలంలోని తెల్లారుపల్లిలో తెల్లవారుజామున జరిగిన ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా దుండగులు తమ్మినేని కృష్ణయ్యను నరికి చంపారు. ఆయన చేతులను నరికి దుండగులు తీసుకెళ్లారని చెబుతున్నారు.

కాగా హత్య జరిగిన తెల్లారుపల్లి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కావడం గమనార్హం. మృతుడు తమ్మినేని కృష్ణయ్య గతంలో సీపీఎంలో కూడా పనిచేశారని చెబుతున్నారు.

పాత రాజకీయ కక్షలే హత్యకు కారణమని చెబుతున్నారు. తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని తనకేదైనా జరిగితే సీపీఎం నాయకులదే బాధ్యత అని గతంలో కృష్ణయ్య ఆరోపించారు. అలాగే కొద్ది నెలల క్రితం ఒక మాజీ కార్పొరేటర్ ను ఖమ్మం పోలీసులు అరెస్టు చేస్తే స్టేషన్ కు వెళ్లి ఆయనను వదిలిపెట్టాలని తమ్మినేని కృష్ణయ్య తన అనుచరులతో ఆందోళన కూడా నిర్వహించారు. ఈ వ్యవహారంలో కృష్ణయ్యతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చారు.

కాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. కృష్ణయ్య హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారని తెలుస్తోంది. పాత కక్షలు కారణమా? లేక మరేదైనా కారణమా అని ఆరా తీస్తున్నారు.

కాగా కృష్ణయ్యకు ఖమ్మం రూరల్ మండలంలో పలు గ్రామాల్లో పట్టు ఉందని టీఆర్ఎస్ లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని.. ఇది నచ్చనివారే ఆయనను హత్య చేశారని చెప్పుకుంటున్నారు.