Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: దొంగ సర్టిఫికెట్.. ఎంపీ అరవింద్ పై ఫిర్యాదు

By:  Tupaki Desk   |   24 May 2020 8:53 AM GMT
బ్రేకింగ్: దొంగ సర్టిఫికెట్.. ఎంపీ అరవింద్ పై ఫిర్యాదు
X
బీజేపీకి చెందిన నిజామాబాద్ యువ ఎంపీ ధర్మపురి అరవింద్ చిక్కుల్లో పడ్డారు. ఆయన దొంగ సర్టిఫికెట్ తో పోటీచేసి గెలిచాడని.. అనర్హత వేటు వేయాలని కేంద్రం ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.

టీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ తాజాగా ఎంపీ అరవింద్ కేంద్ర ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించారని.. తప్పుడు సమాచారం ఇచ్చారని ఈసీకి ఫిర్యాదు చేశారు. అరవింద్ ఎంపీ ఎన్నికల్లో తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల అఫిడవిట్ సమర్పించాడన్నది క్రిశాంక్ ప్రధాన అభియోగం.

గత ఏడాది జరిగిన నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించి నిజామాబాద్ ఎంపీగా అరవింద్ సంచలన విజయం సాధించారు. కవితనే రాజకీయాల్లో యాక్టివ్ లేకుండా చేశాడు. అలాంటి ధర్మపురి అరవింద్ ఇప్పుడు విద్యార్థత విషయంలో తప్పుగా ఎన్నికల సంఘానికి సమర్పించారని టీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో ఇరుక్కున్నారు.

ధర్మపురి అరవింద్ రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని జనర్ధాన్ రాయ్ నగర్లోని రాజస్థాన్ విద్యాపీఠం నుంచి పొలిటికల్ సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ చదివినట్టు ధర్మపురి అరవింద్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి 2018లో దూర విద్యా ద్వారా ఉత్తీర్ణుడయ్యానని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

అయితే తాజాగా ఈ విషయాన్ని రాబట్టాడు టీఆర్ఎస్ నాయకుడు మన్ను క్రిశాంక్. ఆర్టీఐ ద్వారా అరవింద్ చదివిన విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడా అని ఆరాతీయగా.. చదవలేదని విశ్వవిద్యాలయం తెలిపింది. అసలు విద్యార్థిగా తమ విశ్వవిద్యాలయంలోనే నమోదు కాలని క్రిశాంక్ కు ఆర్టీఏలో సమాధానం వచ్చింది. పీజీ చేసినట్టుగా దొంగ సర్టిఫికెట్ ను అరవింద్ కొన్నాడని క్రిశాంక్ తెలిపారు.

దీంతో బీజేపీ ఎంపీ అరవింద్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని టీఆర్ ఎస్ నాయకుడు సతీష్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. త్వరలోనే ఎంపీ అరవింద్ పై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర హైకోర్టులోనూ వేస్తానని తెలిపారు.

కవితను ఓడించి టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్న ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ తాజా అభియోగంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఎంపీ అరవింద్ మరి ఈ దొంగ సర్టిఫికెట్ కేసులో ఇరుక్కుంటాడా లేదా అన్నది వేచిచూడాలి.