Begin typing your search above and press return to search.

గులాబీ వర్సెస్ కమలం.. ఎవరి మాట చెల్లుబాటు అయ్యేను?

By:  Tupaki Desk   |   29 Sep 2020 5:30 PM GMT
గులాబీ వర్సెస్ కమలం.. ఎవరి మాట చెల్లుబాటు అయ్యేను?
X
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హడావుడి నెలకొంది. గడిచిన ఆర్నెల్లుగా కరోనా ధాటికి విలవిలలాడిన రాష్ట్రం.. ఇప్పుడా భయాన్ని పక్కన పెట్టి ఎన్నికల హడావుడిలో మునిగిపోనుంది. కరోనాతో సహజీవనం తప్పించి మరో మార్గం లేని వేళ.. దాని గురించి అట్టే ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలన్న సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చేస్తోంది. గ్రేటర్ కు జరిగే ఎన్నికలతో పాటు.. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు.. వరంగల్.. నిజామాబాద్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

దీంతో.. ఈ ఎన్నికల్లో విజయం మీద గురి పెట్టాయి రాజకీయపార్టీలు. అయితే.. ఈ ఎన్నికల్ని ఏ ఫార్మాట్ లో నిర్వహించాలన్న అంశాన్ని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల్ని కోరింది. దీంతో.. ఏ పార్టీకి ఆ పార్టీ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ తాము బ్యాలెట్ పద్దతిన ఎన్నికలు నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని చెబితే.. మజ్లిస్ సైతం.. ఆ విధానం తమకు ఓకే అని చెప్పింది.

ఇదిలా ఉంటే.. బీజేపీ మాత్రం ఇందుకు భిన్నమైన వాదనను వినిపించింది. కరోనా వేళ.. బ్యాలెట్ కంటే ఈవీఎంల ద్వారా ఎన్నికల్ని జరపటం సురక్షితమని చెప్పారు. బిహార్ ఎన్నికల్లోనూ ఈవీఎంలనే వాడుతున్నారని.. ఐటీ హబ్ అయిన హైదరాబాద్ లో టెక్నాలజీతో కూడిన ఈవీఎంలను వాడాలని కోరుతున్నారు.

తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అండ్ టీం ఎన్నికల కమిషనర్ పార్థసారధిని కలిశారు. ఆయనకు వినతిపత్రాన్ని ఇచ్చిన ఆయన.. ఎన్నికల్ని ఈవీఎంతో నిర్వహించాలని కోరారు.

ప్రజలంతా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా ఆయన చెప్పారు. ఓటమి భయంతోనే బ్యాలెట్ పద్దతిన నిర్వహించాలని టీఆర్ఎస్.. మజ్లిస్ కోరుతున్నట్లుగా ఆరోపించారు. మరి.. ఎన్నికల సంఘం ఎవరి మాటను ఫైనల్ చేస్తుందో చూడాలి?