కాంగ్రెస్ దూకుడుతో టీఆర్ఎస్ లో ఆందోళన పెరుగుతోందా?

Mon Jun 27 2022 05:00:01 GMT+0530 (IST)

TPCC President Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా సాగుతుండటంతో టీఆర్ఎస్ లో ఆందోళన పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలే కాంగ్రెస్ లో చేరుతుండటంతో టీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైందని చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ నేతలు.. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దివంగత పీజేఆర్ (పి.జనార్దన్ రెడ్డి) కుమార్తె హైదరాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.వచ్చే డిసెంబరులో శాసన సభను రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని చేరికలతో రేవంత్ రెడ్డి దూకుడు పెంచారని చెబుతున్నారు. వాస్తవానికి 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటిది రేవంత్ రెడ్డి దూకుడుతో టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న నల్లెల భాగ్యలక్ష్మితోపాటు ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే ఓదెలును చేర్చుకోవడం ద్వారా అధికార పార్టీకి తొలి షాక్ ఇచ్చిందని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ పీజేఆర్ తనయ విజయారెడ్డిని పార్టీలో చేర్చుకుని మరో షాక్ ఇచ్చిం దని చెబుతున్నారు. తాజాగా టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతోపాటు కరకగూడెం జెడ్పీటీసీ సభ్యుడు కాంతారావును పార్టీలో చేర్చుకుందని చెబుతున్నారు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరుల చూపు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉందని అంటున్నారు.

ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ హైదరాబాద్ ఖమ్మం జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ నేతలు ప్రజా ప్రతినిధులను చేర్చుకున్న రేవంత్‌రెడ్డి.. ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి చేరికలను ప్లాన్ చేసుకున్నారని చర్చ పార్టీలో జరుగుతోంది. ఈ చేరికలు విడతల వారీగా జరగనున్నాయని టీఆర్‌ఎస్ బీజేపీకి చెందిన ముఖ్యనాయకులతోపాటు ప్రజాపతినిధులూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. సగానికిపైగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక ఇచ్చారని అంటున్నారు.

ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకునేందుకు చేరికల ప్రక్రియను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముమ్మరం చేశారని చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరిగితే.. ఓటింగ్ సరళిలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని కాంగ్రె స్ వర్గాలు భావిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. చేరికలు పెరి గే కొద్దీ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకమూ పెరుగుతుందని చెబుతున్నారు. జూలై మొదటివారంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికల ప్రక్రియ ఉంటుందనే చర్చ ఆయా పార్టీల్లో జరుగుతుండటం గమనార్హం.

రేవంత్ రెడ్డి దూకుడుతో టీఆర్ఎస్ అసంతృప్తులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారని చెబుతున్నారు. స్వయంగా కేటీఆర్ ఆయా జిల్లాల నేతలకు ఫోన్లు చేసి తొందరపడొద్దని కాంగ్రెస్ పార్టీలో చేరొద్దని చెబుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరగ్గా ఆయా జిల్లాల్లో కేటీఆర్ పర్యటించినప్పుడు వారితో భేటీ కావడమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.