వైరల్ పోస్ట్ చూసి ఇలా అనటమా దేవినేని?

Mon Apr 15 2019 13:55:16 GMT+0530 (IST)

TDP leader Devineni Uma comments on Prashant Kishor team

మాటలు హద్దులు దాటుతున్నాయి. రాజకీయ శత్రుత్వం ఉండొచ్చు. కానీ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం తగదు. గతంలో ఎప్పుడూ లేనంత దారుణ స్థాయికి ఏపీ రాజకీయాలు దిగజారిపోయాయి. వ్యక్తిగతంలోకి రాజకీయం వచ్చేసింది. సామాన్యుల మధ్యే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజకీయ నేతల మధ్య పరిస్థితి మరెలా ఉంటుందో చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రాజకీయం ఎంతగా మారిందో అందరికి అర్థమవుతున్న పరిస్థితి.ఇదంతా ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియా పుణ్యమా అని రాజకీయ పార్టీల మధ్య విమర్శలు.. ఆరోపణలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తమ దృష్టికి వచ్చిన అంశాల్లో నిజం ఎంతన్న విషయాన్ని పక్కన పడేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం పెరిగింది. ఇందుకు నిదర్శనంగా ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యల్ని చెప్పాలి.

గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నట్లుగా నల్లటి గ్రానైట్ రాయి మీద రాసిన ఒక నేమ్ ప్లేట్ చక్కర్లు కొడుతోంది. ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే.. జగన్ తొందరపాటుతో ఇలా రాయించుకున్నారన్నది ఆరోపణ. ఈ నేమ్ ప్లేట్ ఎక్కడిది? అన్న దాని మీద స్పష్టత లేదు. ఈ  నేమ్ ప్లేట్ ఫోటోకు సంబంధించి అనుమానాలెన్నో ఉన్నాయి.

వాటిని పట్టించుకోకుండా  దేవినేని ఆ విషయాన్ని ప్రస్తావిస్తు జగన్ మీద విరుచుకుపడ్డారు. తన కంటి ముందున్న ఫోటోలో ఉన్నది నిజమా?  అబద్ధమా?  అన్నది లెక్కలోకి తీసుకోకుండా నోటికి వచ్చినట్లుగా తిట్లు తిట్టటం షురూ చేశారు. జగన్ అప్పుడు ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం పిచ్చికి పరాకాష్ఠగా నోరు పారేసుకున్నారు. ఇంత తీవ్రంగా తిట్టే ముందు వైరల్ అవుతున్న పిక్ లో నిజమెంత?  అన్నది మరింత స్పష్టంగా చెబితే బాగుంటుంది కదా దేవినేని?