Begin typing your search above and press return to search.

పశ్చిమ రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ స్వల్ప అధిక్యత

By:  Tupaki Desk   |   18 March 2023 6:46 PM GMT
పశ్చిమ రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ స్వల్ప అధిక్యత
X
ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగే ఆటగాడు ఇరగదీసి మెడల్స్ పంట పండించటం.. అదే తీరులో సినిమాలు ఒక్కోసారి బ్లాక్ బస్టర్ కొట్టేయటం చూస్తుంటాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అలాంటి పరిస్థితే నెలకొంది. ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎవరికి ఎలాంటి ఆసక్తి లేదు. కారణం.. అధికార వైసీపీని అధిగమించే సత్తా సైకిల్ పార్టీకి ఉందన్న నమ్మకం ఆ పార్టీ నేతలకే లేని పరిస్థితి.

ఇలాంటి వేళ.. ఏపీలో మార్పు మొదలైందన్న విషయాన్ని బలంగా చెప్పాలనుకున్న పట్టభద్రులు నిశ్శబ్ద ఓటింగ్ తో చెలరేగిపోయారు. ఏపీలో జరుగుతున్నమూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న(ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ) కు ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారినే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ఇంతకాలం పట్టని ఈ ఎన్నికల గురించి ఆరా తీయటమేకాదు.. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే రెండింటిలో (ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ) టీడీపీ విజయం సాధించటంతో తెలుగు తమ్ముళ్లు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమ బలం మీద తమకు నమ్మకం సన్నగిల్లిపోయి.. ప్రజా బలం తమకు ఎంత ఉందన్న విషయంపై అనుమానాలు ఉన్న వేళలో జరిగిన ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు వారికి ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

అందుకేనేమో.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నిర్వహించే సంబరాల విషయంపై ఆంక్షలు ఉన్నాయన్న హెచ్చరికల్ని సైతం లైట్ తీసుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేయటానికి వెనుకాడటం లేదు. ఈ సందర్భంగా కేసుల బూచిని ప్రస్తావిస్తే.. ఏం ఫర్లేదు పెట్టుకోండన్న మాట పలువురి నోట వస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఫలితం ఇంకా తేలని మూడో పట్టభద్రుల ఎమ్మెల్సీ (పశ్చిమ రాయలసీమ) ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. గురువారం మొదలైన ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం సుదీర్ఘంగా సాగింది. మొదటి ప్రాధాన్యత క్రమంలో ప్రధాన పార్టీ అభ్యర్థులకు లభించాల్సిన ఓట్లు రాకపోవటంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించటం షురూ చేశారు. అయితే.. శనివారం తెల్లవారుజాము నాటికి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మాత్రమే పూర్తి కావటం.. రెండో ప్రాధాన్యత క్రమం ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం మొదలైంది.

కాస్తంత మందకొడిగా సాగుతున్న ఈ ఓట్ల లెక్కింపు ఫలితం ఏ రీతిలో ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫలితం నువ్వా నేనా? అన్నట్లు ఉండటం.. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి ఎన్నికల అధికారుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. అత్యంత జాగ్రత్తతో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. దీంతో.. ఈ ప్రక్రియ నిదానంగా సాగుతూ ఆలస్యమవుతోంది. మొత్తం 49 మంది అభ్యర్థులు పోటీ పడిన ఈ ఎన్నికల్లో చెల్లని ఓట్లే 19,239 ఓట్లు ఉన్నాయి. ఇక.. చెల్లుబాటైన 2,26,405 ఓట్లలో ఎవరికైతే 50 శాతం ఓట్లతో పాటు ఒక ఓటు మొదట వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత క్రమం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేనాటికి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి 1800 ఓట్ల స్వల్ప అధిక్యతలో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు షురూ అయ్యాక.. ఆ అధిక్యత కూడా తగ్గిపోయింది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి దాదాపు 500 ఓట్లకు పైగా అధిక్యతో ఉన్నారు. కడపటి వార్తలు అందే సమయానికి 41 మంది అభ్యర్థులను తొలగించారు. మిగిలిన వారి ఓట్లలో రెండో ప్రాధాన్యతలో ఎవరైతే 50 శాతంతో పాటు ఒక ఓటు ముందు వచ్చిన వారు విజేతగా మారతారు.

కేవలం ఎనిమిది టేబుళ్లు మాత్రమే ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే పులివెందుల కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోకి రావటంతో.. ఈ ఫలితంపై ఆచితూచి అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అధికారుల తీరుపై విపక్ష నేతలు అసంత్రప్తితో ఉన్నారు. గెలుపు దిశగా తెలుగుదేశం అభ్యర్థి ఉండటంతో ఫలితాన్ని ఆలస్యం చేసేందుకు అధికారులు నెమ్మదిగా ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లుగా విమర్శలు ఉన్నాయి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.