Begin typing your search above and press return to search.

చంద్రబాబు తాజాగా చేస్తున్న పని తమ్ముళ్లకు నచ్చట్లేదా?

By:  Tupaki Desk   |   25 Nov 2021 11:30 AM GMT
చంద్రబాబు తాజాగా చేస్తున్న పని తమ్ముళ్లకు నచ్చట్లేదా?
X
చంద్రబాబు పేరు చెప్పినంతనే ఎక్కడలేని ఉత్సాహాన్ని తెచ్చుకొని మరీ విరుచుకుపడే వైసీపీ నేతలు మాత్రమే కాదు.. చంద్రబాబు చేసే పనుల్లో తప్పుల్ని ఎత్తి చూపించి ఫైర్ అయ్యేటోళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందే ఉంటారు. అందరికి ఈజీ టార్గెట్ గా ఉండే చంద్రబాబును తాజాగా ఆయన్ను అమితంగా అభిమానించే తెలుగు తమ్ముళ్లు కూడా తప్పు పడుతున్న వైనం రోటీన్ కు భిన్నంగా చెప్పక తప్పదు. బాబు ఏం చేసినా బాగా చేస్తారనే మాటకు బదులుగా.. బాబు చేసిన పనుల్లో మంచి చెడ్డల్ని విశ్లేషించే తెలుగు తమ్మళ్ల వాయిస్ ఇప్పుడు బయటకు వస్తోంది.

తాజాగా నాలుగు జిల్లాల్ని అతలాకుతలం చేసిన వరదల వేళ.. చంద్రబాబు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఇలాంటి వేళల్లో అధికారపక్షం వాయువేగంతో స్పందిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగం పరుగులు దీస్తూ.. బాధితులకు అవసరమైన సాయాన్ని అందించటం చేస్తుంటారు. కానీ.. అందుకు భిన్నంగా ఈసారి ఏపీ ప్రభుత్వం అంతలా రియాక్టు కాలేదన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది.

అన్నింటికి మించి.. బాధితులకు అందాల్సిన ధన సాయం కావొచ్చు.. వస్తు సాయం కూడా అందలేదంటున్నారు. ఇలాంటివేళ.. విపక్ష నేత చంద్రబాబు రియాక్టు కావటమేకాదు.. అనూహ్యంగా స్పందిస్తున్న తీరు ఇప్పుడు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది.

చంద్రబాబుకు పినాసితనం ఎక్కువని.. లబ్థిదారులకు.. బాధితులకుసాయం చేసే విషయంలో అరకొర అన్నట్లుగా వరాల్ని ప్రకటిస్తారని.. ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆయన తీరు ఇలా ఉంటుందని వ్యాఖ్యానిస్తుంటారు. అయితే.. ఈ అంచనాలకు భిన్నంగా వ్యవహరించిన చంద్రబాబు తీరు బాధితులకు సాంత్వన కలిగిస్తే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం గుస్సా అవుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇంతకీ బాబు మీద తెలుగు తమ్ముళ్లకు కోపం ఎందుకంటే.. వరద బాధితులకు పార్టీ తరఫున రూ.5వేల తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అంతే కాదు.. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.లక్ష నష్ట పరిహారం ఇవ్వాలని డిసైడ్ చేయటం తెలిసిందే.

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఈ సాయాన్ని అందిస్తున్నారు. వరదలకారణంగా నష్టపోయిన నాలుగు జిల్లాల వారికి అందిస్తున్న ఈ సాయంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ప్రభుత్వమే బాధితులకు రూ.వెయ్యి మాత్రమే ఇస్తుంటే.. అందుకు భిన్నంగా పార్టీ రూ.5వేల సాయాన్ని అందించటం ఇప్పటివరకు చూడలేదంటున్నారు.

మరింత మంచి పని చేసినందుకు తెలుగు తమ్ముళ్లు సంతోషపడిపోతారు కదా? అంటే.. వారి వాదన మరోలా ఉంది. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవటం మంచిదే అయినా.. ఇంత భారీ సాయాన్ని తీసుకొని కూడా బాధితులకు తమ పార్టీ చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుంటారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లాలో ఎంత సాయం చేసినా.. వారు మాత్రం జగన్ కు మాత్రమే అండగా నిలుస్తారు కానీ.. టీడీపీని గెలిపించే విషయంలో మాత్రం వారు పెద్దగా పట్టించుకోరని.. అలాంటప్పుడు ఆర్థిక సాయాన్ని అందించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అయితే.. ఈ వాదనలో అర్థం లేదన్న మాట కొందరి నోటి నుంచి వినిపిస్తుంది.రాజకీయం అంటే ఓట్ల చుట్టూనే తిరగాలా? కష్టంలో ఉన్న సాటి వ్యక్తికి సాయం చేస్తున్నామనే కోణంలోనే చూడాలే తప్పించి.. సాయం చేశాం కాబట్టి ఓట్లను ఆశించటం నైతికంగా తప్పు అవుతుందని చెబుతున్నారు.

అందుకే.. పార్టీ అందిస్తున్న పరిహారాన్ని మానవత్వంతో స్పందిస్తున్నట్లుగా చూడాలే కానీ.. ఎన్నికల్లో మైలేజీ కోసం అన్నట్లుగా లెక్కలు వేయొద్దన్న హితవు పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. అయితే.. ప్రభుత్వం మాత్రం రూ.వెయ్యి ఇవ్వటం మాత్రం సరికాదన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది.