Begin typing your search above and press return to search.

ఉత్కంఠ వీడింది.. పశ్చిమ రాయలసీమలో టీడీపీ ఘనవిజయం

By:  Tupaki Desk   |   19 March 2023 12:27 AM GMT
ఉత్కంఠ వీడింది.. పశ్చిమ రాయలసీమలో టీడీపీ ఘనవిజయం
X
ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని సంచలన విజయంగా అభివర్ణించాలా? మరీ.. అతి కాకపోతే అన్న మాటను అదాటున అనేయొచ్చు. కానీ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సి వస్తే.. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం ముమ్మాటికి సంచలన విజయంగానే చెప్పాలి. దీనికి కారణం.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉండటం ఒక ఎత్తు అయితే.. పులివెందులలో సైతం అధికార వైసీపీకి దిమ్మ తిరిగేలా ఓట్ల అధిక్యతను సాధించటం మరో ఎత్తు.

ఇక్కడితో ఆగని జైత్రయాత్ర ఎమ్మెల్సీ ఎన్నికను సొంతం చేసుకునేలా చేసింది. పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీ? వైఎస్ కుటుంబం అంటే పులివెందుల అనే పరిస్థితి. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి ఓట్లు పడటం ఏమిటి? తెలుగుదేశం పార్టీకి అధిక్యత రావటం ఏమిటి? వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లా అండగా చెబుతారు. అలాంటి జిల్లాలోనూ వైసీపీ అధిక్యతను గండికొట్టి మరీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్ష నేత విజయం సాధించటం సంచలనం కాకుండా ఇంకేం ఉంటుంది చెప్పంది.

గురువారం ఉదయం మొదలైన ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం సుదీర్ఘం సాగింది. గురువారం.. శుక్రవారంతో పాటు శనివారం రాత్రి వరకు కొనసాగింది. చివరకు మహా ఉత్కంటకు తెర దించుతూ.. టీడీపీ అభ్యర్తి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి విజయం సాధించారు. మొత్తం 49 మంది పోటీ పడిన ఈ స్థానంలో వైసీపీ అభ్యర్తి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7543 ఓట్ల అధిక్యతతో విజయం సాధించటం మాటలు కాదు.

ఎందుకంటే.. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి 1800 ఓట్ల వరకు అధిక్యత ఉండగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో. గెలుపునకు అవసరమైన ఓట్లను సొంతం చేసుకోవటం ద్వారా విజయం టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అది కూడా7543 ఓట్ల మెజార్టీతో అంటే మాటలు కాదనే చెప్పాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి విజయం సాధించాలంటే యాబై శాతం ఓట్లకు మరో ఓటు కలపాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే విజేతను ప్రకటిస్తారు. తాజాగా జరిగిన ఓట్ల లెక్కింపును చూస్తే.. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ.. వైసీపీ అభ్యర్థులకు మెజార్టీ రాకపోవటంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టారు. అందులో భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా.. అధికార వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డికి 1,02,238 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. దీనికి తోడు.. అధికార వైసీపీ అభ్యర్థి ఓటమి ఖరారైంది. విజేతను ప్రకటించే వేళలో.. హైడ్రామా చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపులో సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో పాటు ఫిర్యాదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు వ్యతిరేకంగా స్పందించారు. ఎన్నికల సంఘం వారు నిష్ఫక్షపాతంగా వ్యవహరించాలని టీడీపీ నేతలు కోరారు. దీంతో.. ఉన్నతాధికారుల చర్చల అనంతరం టీడీపీ అభ్యర్థి విజయం సాధించారన్న విషయాన్ని తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఓట్లు లెక్కింపుపై ఉన్నతాధికారులతో సంప్రదింపుల తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని చెబుతున్నారు. అయితే.. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగినట్లుగా వైసీపీ అభ్యర్థి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నిరసన చేపట్టారు. అయితే.. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. అధికారికంగా తనకు పంపాలని అధికారులు స్పష్టం చేశారు. అయితే.. కలెక్టర్ జోక్యం తర్వాత వైసీపీ అభ్యర్థి ఆందోళనను విరమించటం గమనార్హం. ఏమైనా మూడు రోజులుగా సాగుతున్న ఉత్కంఠ వీడటం ఒక ఎత్తు అయితే.. ఈ ఎన్నిక ఫలితం విపక్ష టీడీపీకి అనుకూలంగా రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.