Begin typing your search above and press return to search.

పరిటాల వారసుడికి టికెట్ కన్ఫ్యూజన్

By:  Tupaki Desk   |   21 March 2023 8:00 AM GMT
పరిటాల వారసుడికి టికెట్ కన్ఫ్యూజన్
X
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ రాజకీయంగా కీలకమైనది. పరిటాల రవి మూడు దశాబ్దాల క్రితమే జిల్లాలో ప్రముఖ నాయకుడిగా తెలుగుదేశంలో ఉంటూ వచ్చారు. రవి దారుణ హత్య తరువాత ఆయన సతీమణి సునీత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. పరిటాల వారసుడు శ్రీరాం 2019లో తొలిసారి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తరువాత ఆయనకు ధర్మవరం బాధ్యతలు అప్పగించారు. ధర్మవరం నుంచి 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ఓడిన వెంటనే బీజేపీలోకి చేరిపోయారు. సూరి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ధర్మవరంలో గెలిచారు. ఆయనకు అక్కడ పట్టు ఉంది. ఇక ఇపుడు చూస్తే సూరి మళ్ళీ టీడీపీలోకి చేరడానికి ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు.

సూరికి ధర్మవరంలో ఉన్న పట్టుని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలని అధినాయకత్వం అనుకుంటోందని టాక్. అదే జరిగితే ధర్మవరం నియోజకవర్గాన్ని నాలుగేళ్ల పాటు ఇంచార్జిగా చూసిన పరిటాల శ్రీరాం సంగతి ఏంటి అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది. రాప్తాడులో ఈసారి పరిటాల సునీత పోటీ చేస్తారు. దాంతో శ్రీరాం కి ధర్మవరం అని అనుకున్నారు.

రాప్తాడులో పట్టు సాధించాలంటే ధర్మవరం కూడా పరిటాల ఫ్యామిలీ ఆధీనంలోనే ఉండాలన్నది ఆ ఫ్యామిలీ ఆలోచన. అందుకే శ్రీరాం ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు పట్టుపడుతున్నారు. అయితే వరదాపురం సూరి వచ్చి ఆయన కలలను కల్లలుగా చేసేలా ఉన్నారని అంటున్నారు. మరి శ్రీరాం కి ఎక్కడ పోటీకి అవకాశం ఇస్తారు అంటే పెనుగొండ నుంచి అని అంటున్నారు.

పెనుగొండ నుంచి పరిటాల శ్రీరాం కి చాన్స్ ఇస్తారని అంటున్నారు. అయితే అది పరిటాల శ్రీరాం కి ఇష్టం లేని వ్యవహారమని అంటున్నారు. తాను ధర్మవరంలో పార్టీని నిలబెట్టానని పార్టీ కోసం పనిచేసే వారికే టికెట్లు అని అధినాయకత్వం చెప్పిన మేరకు తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా పరిటాల వారసుడికి టికెట్ల కష్టాలు తప్పడంలేదు అంటున్నారు తొలిదఫా పోటీ చేసి ఓడారు. రెండవమారు ఇష్టమైన సీటు నుంచి పోటీకి రెడీ అవుతూంటే చివరలో హై కమాండ్ ట్విస్ట్ ఇచ్చేలా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఆయన టికెట్ కన్ఫ్యూజన్ ఒక కొలిక్కి వస్తుందో రాదో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.