Begin typing your search above and press return to search.

సీట్ల పైన సీనియర్ల కర్చీఫ్...టీడీపీ పక్కా వ్యూహం...?

By:  Tupaki Desk   |   9 Jun 2023 9:39 PM GMT
సీట్ల పైన సీనియర్ల కర్చీఫ్...టీడీపీ పక్కా వ్యూహం...?
X
తెలుగుదేశం రాజకీయంగా ఢక్కా మెక్కీలు తింది. అనేక ఎన్నికల యుద్ధాల ను చూసింది. ఎందరినో యోధానుయోధుల ను ఢీ కొట్టి నిలిచి గెలిచింది. అలాంటి టీడీపీ కి పొత్తులు ఎపుడూ సమస్యలు తేలేదు. వన్ సైడెడ్ గా అవి అలా కుదిరి పోతూ టీడీపీ కే గరిష్ట రాజకీయ లాభాల ను తెచ్చాయి. కానీ ఫస్ట్ టైం టీడీపీ కి జనసేన తో అలాంటి వ్యవహారంగా కనిపించడంలేదు.

పొత్తులు అన్నవి తమకు నూరు శాతం లాభంగా ఉండాల ని జనసేన మొదటి నుంచి గట్టి గా కోరుకుంటోంది. సీట్లు ఇచ్చేమంటే ఇచ్చామని కాదు, తమ కు బలమున్న చోట ఇవ్వాలి. అలా తమ వాళ్ళందరూ గెలవాలి. ఏపీ లో వైసీపీ టీడీపీల కు సమానంగా మూడవ పొలిటికల్ ఆల్టర్నేషన్ గా జనసేన ఉండాలి. అందుకోసమే పొత్తుల ఎత్తుగడలు. ఈ విషయాన్ని పవన్ ఎక్కడా దాచుకోవడంలేదు. ఆయన ఓపెన్ గానే చెబుతున్నారు.

పొత్తుల తోనే చాలా రాజకీయ పార్టీలు ఎదిగాయని, అందుకే తాము కూడా పొత్తుల తోనే ఏపీ లో బలాన్ని పెంచుకుంటామని పార్టీ మీటింగ్స్ లోనూ మీడియా మీటింగ్స్ లోనూ చెప్పుకొచ్చారు. మరి ఇంతటి క్లారిటీ ఉన్న జనసేన ఊరకే ఏవో కొన్ని సీట్లు తీసుకుని సరిపుచ్చుకుని టీడీపీ పల్లకీ మోస్తుందనుకుంటే పొరపాటే అంటున్నారు. పైగా పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లోనే అత్యంత గ్లామర్ ఉన్న లీడర్.

ఆయన సభల కు జనాలు తండోప తండాలు గా వస్తారు. ఈ నేపధ్యం లో పవన్ సీఎం కావాల ని అంతా కోరుకుంటున్నారు అని జనసేన వర్గాలు అంటున్నాయి. పొత్తుల లో ఎక్కువ సీట్లు తీసుకోవాలని కూడా జనసేన చూస్తోంది. అయితే తెలుగుదేశాని కి ఇది పెద్ద చిక్కుగా ఉంది. దాంతో ఆ పార్టీ లోని సీనియర్లు ఇపుడు గొంతు విప్పి తమదే సీటు అని ప్రకటించుకోవడం పట్ల చర్చ సాగుతోంది.

జనసేన లో నంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ సొంత సీటు గుంటూరు జిల్లా తెనాలి. ఆయన అక్కడ నుంచి 2004లో మొదటిసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2009లో రెండవ సారి గెలిచారు. అంతకు ముందు 1994లో ఆయన తండ్రి మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు కూడా తెనాలి సీటు నుంచే కాంగ్రెస్ తరఫున గెలిచారు.

ఇలా తెనాలి తో నాదెండ్ల ఫ్యామిలీ కి మంచి అనుబంధం ఉంది. ఆ సీటు నుంచి 2024 లో పోటీ చేయాలని మనోహర్ చూస్తున్నారు. అయితే ఇపుడు సడెన్ గా సీన్ లోకి వచ్చిన తెనాలి టీడీపీ ఇంచార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తానే 2024లో తెనాలి నుంచి పోటీ చేస్తానంటూ బిగ్ సౌండ్ చేశారు. ఈ సీటు తనదేనని ఆయన చెప్పేశారు. ఒక విధంగా ఆలపాటి గట్టిగానే చెప్పారని అంటున్నారు.

దీంతో జనసేన లో తర్జన భర్జనలు మొదలయ్యాయి. నాదెండ్ల మనోహర్ కే సీటు ఇవ్వక పోతే ఇక పొత్తులు ఎందుకు ఎలా ముందుకు వెళ్లాలి అన్న చర్చ కూడా ఆ పార్టీలో వస్తోంది అని అంటున్నారు. పవన్ కి అత్యంత సన్నిహితుడు నాదెండ్ల అన్నది తెలిసిందే. ఈ మధ్య మంగళగిరి లో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ నాదెండ్ల ను ఎవరైనా ఏమైనా అంటే సొంత పార్టీ వారు అయినా బయట కు పంపిస్తాను అని హెచ్చరించారు అంటే ఎంతటి అభిమానమో అర్ధం చేసుకోవాలి.

అలాంటి నాదెండ్ల కు సీటు లేదు అంటే పవన్ ఊరుకుంటారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. మరో వైపు చూస్తే తెలుగుదేశాని కి బలమున్న సీట్లనే జనసేన టిక్కు పెట్టి మరీ కోరుతోంది అన్న ప్రచారం ఉంది. నిజానికి ఈ రెండు పార్టీల ఓటు బ్యాంక్ బలాలు బలగాలు కూడా దాదాపు గా ఒక్కటిగానే ఉన్నాయి. పొత్తుల లో భాగంగా తమకు పట్టు పెద్దగా లేని రాయలసీమ లోని జిల్లాల లో సీట్లు కొన్ని జనసేనకు ఇవ్వాల ని టీడీపీ భావిస్తోందని ప్రచారంలో ఉంది.

అయితే అది ముందే ఊహించే పవన్ కళ్యాణ్ తమ పార్టీకి ఏపీ లో ఏ రీజియన్ లో ఎంత బలం ముందో పార్టీ వేదిక మీదనే ప్రకటించారు. కోస్తా జిల్లాల లో తాము చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని ఆయన చాటుకున్నారు. రాయలసీమ లో తక్కువ బలం ఉందని చెప్పేసుకున్నారు. అందువల్ల తమకు కోస్తా జిల్లాలలోనే ఎక్కువ సీట్లు కావాలని ఆయన ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

కోస్తా జిల్లాలలో టీడీపీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. పైగా సీనియర్లు అంతా అక్కడ నుంచి అనేక దఫాలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇపుడు ఆయా సీట్లను జనసేన కు పొత్తులో భాగంగా ఇస్తే వారు ఊరుకోరు అని అంటున్నారు. దాంతోనే ఆలపాటి ముందుగా మీడియా వద్దకు వచ్చి మనసు లో మాట చెప్పేశారు అంటున్నారు. ఇదే తీరున ఇక మీదట టీడీపీ సీనియర్లు జనసేన కన్నేసిన సీట్ల విషయంలో తామే పోటీ లో ఉంటామంటూ ముందే కుండబద్ధలు కొడతారు అని అంటున్నారు.

చూడబోతే ఇదంతా టీడీపీ ఒక వ్యూహం ప్రకారమే నడిపిస్తోందా అన్న చర్చ కూడా ఉందిట. అలా చేయడం ద్వారా తమ పార్టీకి బలం ఉన్న సీట్లను ఇవ్వబోమని ఒక సంకేతాన్ని జనసేన కు ఇండైరెక్ట్ గా టీడీపీ పంపిస్తోంది అని అంటున్నారు. మరి దీనిని జనసేన ఎలా తట్టుకుంటుందో. ఏ విధంగా బలమైన సీట్ల ను తెచ్చుకుంటుందో చూడాల్సి ఉంది అంటున్నారు. జనసేన నంబర్ టూకే టీడీపీ గురి పెడితే మిగిలిన వారి సీట్లు సంగతేంటి అన్న చర్చ కూడా సాగుతోందిట.