చిన్న కరెక్షన్ తమ్ముళ్లు..అప్పట్లో ప్రజల అండ ఉంది

Thu Jul 12 2018 09:48:48 GMT+0530 (IST)

TDP MPs To Stage Protest In Anantapur For Andhra Special Status

నాలుగేళ్లు నిద్ర పోయి.. ఒక్కసారి ఉలిక్కిపడిన చందంగా వ్యవహరిస్తున్నారు ఏపీ టీడీపీ నేతలు. విభజనలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రకటనపై  కేంద్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఎంత ప్రశ్నించారన్నది తెలుగోళ్లందరికి బాగా తెలిసిందే. రాజకీయ ప్రయోజనం కోసం మోడీతో కటీఫ్ చెప్పి.. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామంటూ చెప్పే మాటల్లో అర్థం లేదని చెప్పాలి.ఎన్నికల వేళ.. ప్రజల్లో భావోద్వేగాన్ని రగిలించేందుకు ప్రత్యేక హోదా మీద పోరాటాలు షురూ చేస్తున్నట్లు చెప్పటంలో అర్థం లేదనే చెప్పాలి. నిజానికి ప్రత్యేక హోదా సాధన మీద తమ్ముళ్లకు అంత కమిట్ మెంట్ ఉంటే.. ముందు నుంచే దీనికి గురించి మాట్లాడేవారు. హోదా సాధన కోసం పోరాటాలు చేసే వారిని అరెస్ట్ చేయటం.. కేసులు బుక్ చేయటం.. నిరసన కోసం విపక్ష నేత వస్తే ఎయిర్ పోర్ట్ దాటనీయకపోవటం లాంటి గాయాలెన్నో ప్రజల మనసుల్లో ఇంకా పచ్చిగా ఉన్నాయన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తించనట్లుంది.

ఈ కారణంతోనే కావొచ్చు.. తాము వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడితే ప్రజలు ఊగిపోతారన్నట్లుగా ఉంది టీడీపీ ఎంపీల తీరు చూస్తుంటే. ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ ఎంపీలు తాజాగా అనంతపురంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారి నోటి నుంచి పెద్ద పెద్ద మాటలే వచ్చాయి. పోరాటాలతో కేంద్రం మెడలు వంచే శక్తి తెలుగు ప్రజలకు ఉందంటూ వారు గొప్పలు చెప్పుకొచ్చారు.

నిజమే.. పోరాటాలతో కేంద్రం మెడలు వంచే సత్తా తెలుగోళ్లకు ఉంది కానీ.. ఆంధ్రోళ్లకు కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాము చెప్పిన మాటకు ఉదాహరణగా గతాన్ని తెర మీదకు తెచ్చిన తమ్ముళ్లు.. అప్పట్లో ఎన్టీఆర్ ను పదవీచ్యుడ్ని చేస్తే.. పోరాటాల ద్వారానే ఆయన్ను సీఎం చేశారని గుర్తు చేశారు.

నిజమే.. అప్పుడు ఆంధ్రోళ్లకు తెలంగాణ ప్రాంత ప్రజల అండ ఉందన్నది మర్చిపోకూడదు. అన్నింటికి మించి ఈ ఇష్యూలో ప్రజల అండ ఉంది. తనను పదవీచ్యుతుడ్ని చేసిన ఎపిసోడ్ లో కేంద్రంపై పోరాడే విషయంలో ఎన్టీవోడు ఇప్పటి చంద్రబాబు మాదిరి డబుల్ స్టాండ్ తీసుకోలేదన్నది మర్చిపోకూడదు. అదే.. కేంద్రం దిగి వచ్చేలా చేసింది. ఇప్పుడు జరిగింది ఇది కాదుగా. నాలుగేళ్లు హ్యాపీగా మోడీ మిత్రుడిగా వ్యవహరించి.. పవర్ ను ఎంజాయ్ చేసి.. ఎన్నికలకు ఏడాది ముందు వచ్చి పోరాటం.. మెడలు వంచటం లాంటి మాటలు తమ్ముళ్లు చెబితే.. నమ్మేయటానికి జనాలేం పిచ్చోళ్లు కాదన్నది మర్చిపోకూడదు. ప్రత్యేక హోదా సాధన కోసం తమ్ముళ్లు చేపట్టే నిరసనలన్నీ కూడా.. గతాన్ని గుర్తుకు తెచ్చేలా చేయటమే కాదు.. ఈ ఇష్యూలో బాబు యూటర్న్ లు గుర్తుకొచ్చి తమ్ముళ్ల మీద మరింత వ్యతిరేకత వ్యక్తమయ్యేలా చేస్తుందన్నది మర్చిపోకూడదు.