Begin typing your search above and press return to search.

వాళ్ళంతా గొట్టంగాళ్ళు...చిర్రెత్తితే పార్టీ మార్చేస్తా...!

By:  Tupaki Desk   |   8 Jun 2023 1:40 PM GMT
వాళ్ళంతా గొట్టంగాళ్ళు...చిర్రెత్తితే పార్టీ మార్చేస్తా...!
X
కేశినేని నాని. విజయవాడ ఎంపీ, తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు. ఆయన తెలుగుదేశంలో కంఫర్టబుల్ గా ఉండడంలేదు. ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు. రెండవ సారి గెలిచిన దగ్గర నుంచి హై కమాండ్ తో విభేదిస్తున్నారు. గురువారం కేశినేని నాని మీడియాకు మసాలా ఇస్తూ టీడీపీ హై కమాండ్ ని గట్టిగానే టార్గెట్ చేశారు.

ఆయన చాలా విషయాలే చెప్పేశారు. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడుకు తనకు ఆహ్వానం రాలేదని, అందుకే వెళ్ళలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. మహానాడులో ఎంపీ కేశినేని కనిపించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. రాజమండ్రీలో జరిగిన మహానాడులో తనకు ఆహ్వానమే లేదు అని సాక్షాత్తూ ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ చెప్పడం అంటే అది డ్యామేజింగ్ గానే చూడాల్సి ఉంది అంటున్నారు.

అంతే కాదు పార్టీ ఎవరెవరినో ఇంచార్జిగా నియమించిందని అయితే వాళ్ళంతా గొట్టంగాళ్ళు అంటూ కేశినేని చాలా పరుషంగా మాట్లాడారు. వారి వల్ల అయ్యేది ఏమీ లేదనేశారు. తాను ప్రజల కోసం ఆలోచిస్తానని, అభివృద్ధి మాత్రమే చూస్తానని ఆయన చెప్పడం విశేషం. తనకు అన్ని పార్టీలలో మిత్రులు ఉన్నారని, తాను పార్టీలను రాజకీయాలను చూడనని ఆయన తెగేసి చెప్పారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ ఆఫీసు పెట్టారని, దానికి కూడా తనకు ఆహ్వానం లేదని కేశినేని చెప్పడం మరో విశేషం. పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఆ ఆఫీస్ ఓపెనింగ్ కి వెళ్ళినా తనను పిలవకపోవడమే చిత్రంగా ఉందని అన్నారు. ఇలా టీడీపీలో తాను జస్ట్ ఒక సభ్యుడిని మాత్రమేనని తనను ఏ పదవులూ పిలుపులూ లేవని నాని అనడం కూడా హీటెత్తిస్తోంది.

మరో వైపు చూస్తే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ విషయంలో కూడా తనకు ఎలాంటి సమాచారం లేదని, తానే తెలుసుకుని బాబుకు ఆహ్వానం పలికానని, అది తన బాధ్యతని ఆయన చెప్పుకున్నారు టీడీపీ బీజేపీల మధ్య పొత్తు విషయం చర్చించేటంత తాహతు హోదా తనకు లేవని నాని అంటూనే ఆ విషయం తనకు అనవసరం అన్నట్లుగా మాట్లాడారు.

ఇక తనకు అన్ని పార్టీలలో మంచి పేరు ఉందని, అయితే తాను టీడీపీని వీడే యోచనలో లేనని చెప్పేశారు. కానీ తనకు చిర్రెత్తిస్తే మాత్రం ఏమి చేస్తానో తెలియదు అంటూ పార్టీ మారే విషయం అలా పెండింగులో పెట్టేశారు. మొత్తానికి టీడీపీ ఎంపీ అంటే కేవలం రామ్మోహన్ నాయుడే తప్ప తాము కాదని కుండబద్ధలు కొట్టారు.