Begin typing your search above and press return to search.

వైసీపీ నేతల దాడిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీఏ సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు!

By:  Tupaki Desk   |   5 Dec 2022 9:05 AM GMT
వైసీపీ నేతల దాడిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీఏ సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు!
X
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల దాడిలో టీడీపీ నాయకుడి సహాయకుడు, ఆ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. పెదవేగి మండలం కొప్పాక సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యక్తిగత సహాయకుడు శివబాబు, టీడీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. పెదకడిమి గ్రామానికి వెళ్తున్న టీడీపీ వర్గీయులను అలుగులగూడెం వద్దకు రాగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని బాధితులు పోలీసులకు తెలిపారు. స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తిని కలిసేందుకు శివబాబు మరికొంతమంది జీపులో పెదకడిమి గ్రామంలోని రాజా తోటకు బయలుదేరారు. ఈ క్రమంలో అలుగులగూడెం వంతెన వద్ద వైసీపీ వర్గీయులు టీడీపీ నేతల వాహనాన్ని ఆపారు.

ఎక్కడికి వెళుతున్నారంటూ కర్రలు, రాడ్డులతో దాడికి దిగారు. ఈ ఘటనలో శివబాబు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివబాబు తలకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.

కాగా, కొప్పాక సమీపంలోని పోలవరం కుడికాలువ వద్ద వైసీపీకి చెందిన కొందరు జేసీబీలతో మట్టి తవ్విస్తున్నారని.. ఆ సమయంలోనే తాము అటుగా వెళ్లడంతో వారిని అడ్డుకునేందుకు వెళ్తున్నామనుకుని దాడి చేశారని శివబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై దాడి చేసిన వారిలో వైసీపీకి చెందిన కొప్పాక రంగారావు, పచ్చిపులుసు శివ, మరికొంతమంది ఉన్నారని పోలీసులకు తెలిపారు. బాధితులను చింతమనేని భార్య రాధ పరామర్శించారు.

మరోవైపు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో శివబాబు తదితరులు చికిత్స పొందుతున్న సమయంలోనే... దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారావు, శివ, మరికొందరు సైతం ఆస్పత్రిలో చేరారు. తమను టీడీపీ నేతలు కొట్టారని ఆరోపించారు.

ఈ క్రమంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.