బాబు వార్నింగ్... అయినా సైలెంట్ మోడ్ లోనే... ?

Sun Nov 28 2021 23:00:01 GMT+0530 (IST)

TDP Leaders On Silent Mode Even After Babu Warning

చంద్రబాబు ఎపుడూ గుప్పిట మూసే ఉంచుతారు. ఆయన మార్క్ పాలిటిక్స్ అలాగే ఉంటుంది. ఏ డెసిషన్ అయినా చివరి నిముషం వరకూ నాన్చి కానీ బయటకు చెప్పరు. అలాంటి  బాబు వైఖరిలో ఇపుడు అనూహ్య మార్పు కనిపిస్తోంది. ఎన్నికలు రెండున్నరేళ్లు ఉండగానే రంగంలోకి దిగిపోయారు. అంతే కాదు అభ్యర్ధుల ఎంపిక గురించి కూడా  కొన్ని లెక్కలు వేసుకుంటున్నారు. వాటి మీద ఓపెన్ గానే క్లారిటీ ఇస్తున్నారు.  ఇప్పటికే ఆలస్యం చేశారు ఇక చేస్తే అమృతమే విషం అవుతుందని తమ్ముళ్ళకు వార్నింగులు ఇస్తున్నారు.అయినా కూడా టీడీపీలో సైలెంట్ మోడ్ లో ఉన్న వారు ఎక్కడా రియాక్ట్ అయినట్లుగా దాఖలాలు లేవు. చంద్రబాబు రీసెంట్ గా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఆరుగాలం కష్టపడిన వారికే సీటు వారితోనే సైకిల్ సవారీ అంటూ కుండ బద్ధలు కొట్టారు. పార్టీకి పనిచేయకుండా టికెట్లు అంటే టిక్కేస్తాను అంటూ గర్జించారు. మరి అన్ని విషయాలు తెలిసి కూడా కొంతమంది ఇంకా అలాగే ఉన్నారు. తామున్న చోట నుంచి కదలడంలేదు పెదవి విప్పి పలకడంలేదు. వారి వైఖరి ఎలా ఉంది అంటే ఏపీలోని టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన్స కూడా నో యాక్షన్. చంద్రబాబు ఫ్యామిలీ మీద వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినా అసలు నోరెత్తడంలేదు. నియోజకవర్గాల  వారీగా నిరసనలు చేసినా కూడా వారి ఎక్కడా కనిపించడంలేదు.

మరి బాబు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ని కూడా వారు ఎందుకు లైట్ తీసుకుంటున్నారో అర్ధం కావడంలేదు అంటున్నారు. ఉత్తరాంధ్రా విషయానికి వస్తే మాజీ మంత్రులు కొందరు అసలు మాట్లాడడంలేదు. వారితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా నోరు కుట్టేసుకున్నారు. వారంతా ఒక నాయకుడి నాయకత్వాన గతంలో ప్రజారాజ్యంలో చేరిన వారే. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరి అధికారాన్ని అనుభవించారు. ఇపుడు వారు కొత్త ఆలోచనలు చేస్తున్నారా అన్న చర్చ ఉంది. ఇక ఈ వర్గంలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే విజయనగరానికి చెందిన మీసాల గీత చంద్రబాబుని కలసి వచ్చారు. ఆమెను పార్టీని పటిష్టత చేయమని బాబు ఆదేశించారు. మూడు జిల్లాలలో  ఉద్ధండులు లాంటి నాయకులు ఉన్నారు. మరి వారు ఎందుకు బాబుతో కలసి మాట్లాడడంలేదు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఇక్కడ మరో ప్రచారం కూడా ఉంది. ఇలాంటి వారంతా 2024 ఎన్నికల ముందు తమ యాక్షన్ ప్లాన్ ని బయటకు తీస్తారు అంటున్నారు. అప్పటి పరిస్థితులను బట్టి అయితే వైసీపీ లేకపోతే జనసేనలోకి వెళ్లడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారుట. అందుకే వారు నెమ్మదిగా ఉంటున్నారని టాక్. ఇలా కీలక నేతలు అంతా గప్ చిప్ కావడంతోనే ఉత్తరాంధ్రాలో సైకిల్ జోరు లేకుండా పోయింది అంటున్నారు. ఇక చంద్రబాబు కూడా మాటలకు పరిమితం కాకుండా చేతలకు దిగి ఆయా నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలని తమ్ముళ్ళు కోరుతున్నారుట. మరి బాబు ఆ డెసిషన్ కి వస్తేనే తప్ప సైకిల్ బెల్స్ గట్టిగా మోగవన్నది నిజం.