Begin typing your search above and press return to search.

న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. అంతేనా ల‌క్ష్మీపార్వ‌తి?

By:  Tupaki Desk   |   26 Sep 2022 4:30 PM GMT
న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. అంతేనా ల‌క్ష్మీపార్వ‌తి?
X
న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంతేనా ల‌క్ష్మీపార్వ‌తి అని నెటిజ‌న్లు ఎద్దేవా చేస్తున్నారు. విజ‌య‌వాడ‌లో 25 ఏళ్లుగా ఎన్టీఆర్ పేరుతో ఉన్న హెల్త్ యూనివ‌ర్సిటీకి జ‌గ‌న్ ప్ర‌భుత్వం వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీ అని పేరు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న జ‌రిగి వారం రోజులు అవుతున్నా స్పందించడానికి ఇప్ప‌టిదాకా స‌మ‌యం తీసుకున్న ల‌క్ష్మీపార్వ‌తి అస‌లు విష‌యం గాలికొదిలి కొస‌రు విష‌యాల‌కే ప్రాధాన్య‌త ఇచ్చార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎన్టీఆర్ పార్టీ పెట్ట‌క‌ముందు అంటే 1982లోనే ఆయ‌న ద‌గ్గ‌ర గండికోట కుటీరం త‌ప్ప ఏ ఆస్తులూ లేవ‌ని ల‌క్ష్మీపార్వ‌తి చెప్ప‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను తానే చూసుకున్నాన‌ని.. ఆయ‌న ఆరోగ్యం బాగోక‌పోతే ప్ర‌చారం నిర్వహించి 1994లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చాన‌ని ల‌క్ష్మీపార్వ‌తి తాజా ప్రెస్ మీట్లో చెప్పుకోవ‌డాన్ని ఖండిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర‌మంతా ప్రాంతీయ స‌ద‌స్సులు నిర్వ‌హించాన‌ని.. ఓవైపు ఎన్టీఆర్ ఎక్క‌డ తూలిప‌డ‌తారోన‌ని ఆయ‌న చూసుకుంటూ.. మ‌రోవైపు పార్టీని ఎన్నిక‌ల్లో విజ‌యంవైపు న‌డిపించాన‌ని ఆమె చెప్ప‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

1984లో దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ దేశ ప్ర‌ధానిగా ఉంటూ హ‌త్య‌కు గుర‌యిన‌ప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో దేశ‌మంతా కాంగ్రెస్‌కు సానుభూతి ప‌వ‌నాలు వీచి ఆ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించింది. కానీ ఆ సానుభూతి నాటి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌నిచేయ‌లేదు. తెలుగుదేశం పార్టీ ఏకంగా మొత్తం 42 స్థానాల్లో 34 స్థానాల‌ను గెలుచుకుంద‌ని గుర్తు చేస్తున్నారు. అలాంటి పార్టీని ఎన్టీఆర్‌ను చూసే 1994లో ప్ర‌జ‌లు ఓట్లేశార‌ని.. ల‌క్ష్మీపార్వ‌తిని చూసి కాద‌ని అంటున్నారు. తానే టీడీపీని అధికారంలోకి తెచ్చాన‌ని ల‌క్ష్మీపార్వ‌తి చెప్పుకోవ‌డం మ‌రీ అతిశ‌యోక్తిగా ఉంద‌ని.. ఈ విష‌యంలో ఆమె వ్య‌వ‌హార శైలి న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న‌ట్టు ఉంద‌ని అంటున్నారు.

ఎన్టీఆర్ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పూజ చేసుకుని ఆయ‌న‌కు యోగా చేయ‌డం అల‌వాట‌ని గుర్తు చేస్తున్నారు. శ‌రీర పోష‌ణ‌, ఆరోగ్యం విష‌యంలో ఎన్టీఆర్ మొద‌టి నుంచి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునేవార‌ని, ఆహార నియ‌మాల ప‌ట్ల ఎంతో శ్ర‌ద్ధ తీసుకునేవార‌ని అంటున్నారు. అలాంటి ఎన్టీఆర్‌ను ల‌క్ష్మీపార్వ‌తి తానే కాపాడ‌నని, ఆయ‌న‌ను ర‌క్షించాన‌ని చెప్ప‌డంపై సెటైర్లు ప‌డుతున్నాయి.

మ‌ళ్లీ పైగా ఎన్టీఆర్ త‌న‌ను మంత్రి ప‌ద‌విని తీసుకోవాల‌ని అడిగార‌ని.. త‌న‌కు ప‌ద‌వీకాంక్ష లేక‌పోవ‌డంతో ప‌ద‌విని తీసుకోలేద‌ని ల‌క్ష్మీపార్వ‌తి చెప్పారు. చివ‌ర‌కు మోహ‌న్ బాబుతో కూడా ఎన్టీఆర్ ఈ విష‌యం చెప్పార‌ని.. నాకు ఏదైనా అయితే ఈమె ప‌రిస్థితి ఏమిటి.. మంత్రి ప‌ద‌విని తీసుకోమంటే తీసుకోవ‌డం లేదు.. క‌నీసం నువ్వ‌యినా ఆమెకు చెప్పి ఒప్పించు బాబూ అని మోహ‌న్ బాబుకు ఎన్టీఆర్ చెప్పార‌ని ల‌క్ష్మీపార్వ‌తి చెప్పుకొచ్చారు.

తానెప్పుడూ ఎలాంటి ప‌దవులు ఆశించ‌లేద‌ని.. ఎలాంటి జోక్యం చేసుకోలేద‌ని చెప్ప‌డంపైన విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ల‌క్ష్మీపార్వ‌తికి తాను వ‌డ్డాణం కొనిచ్చి ఉంటే తాను నాడు మంత్రిని అయ్యేవాడిన‌ని ప్ర‌స్తుతం టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు ఒక ఇంట‌ర్వ్యూలో ఇటీవ‌ల చెప్పార‌ని గుర్తు చేస్తున్నారు. దీనికి ల‌క్ష్మీపార్వ‌తి స‌మాధానం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. లారీల‌కు లారీల ప‌ట్టు చీర‌లు అప్ప‌ట్లో ల‌క్ష్మీపార్వ‌తికి వెళ్లేవ‌ని.. అలాగే న‌గ‌లు సైతం పంపేవార‌ని.. అలాంటివారికే ల‌క్ష్మీపార్వ‌తి ప‌ద‌వులు ఇప్పించేవార‌ని అంటున్నారు.

మ‌రి ల‌క్ష్మీపార్వ‌తి ప‌దవుల పంపిణీలో జోక్యం చేసుకోక‌పోతే ఈ విమ‌ర్శ‌లు ఎందుకు వ‌స్తాయ‌ని నిల‌దీస్తున్నారు. ఒక్క ఎర్ర‌బెల్లి దయాక‌ర‌రావు మాత్ర‌మే కాకుండా ప‌లువురు ల‌క్ష్మీపార్వ‌తి రాజ్యాంగేత‌ర శ‌క్తిగా 1994-95 మ‌ధ్య వ్య‌వ‌హ‌రించింద‌ని చెప్పార‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.