Begin typing your search above and press return to search.

బాబు చెప్పినా వినం : వీపులు పగులుట ఖాయం...

By:  Tupaki Desk   |   28 Jun 2022 5:30 PM GMT
బాబు చెప్పినా వినం :  వీపులు పగులుట ఖాయం...
X
ఒక విధంగా తెలుగుదేశం తమ్ముళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు వారి అవేశానికి ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. మూడేళ్ళుగా వారు వైసీపీ సర్కార్ దూకుడుతో నానా అవస్థలు పడుతున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. కదిలితే చాలు అరెస్టులు అంటున్నారు. ఇక ఇళ్ల మీదకు బుల్డోజర్లు రావడం పరిపాటిగా మారింది. కూల్చుడే కూల్చుడు అంటూ వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడంతోనే మొదలెట్టిన మహా యాగం అలా సాగిపోతోంది.

దాంతో సహనం నశిస్తున్న టీడీపీ తమ్ముళ్ళు గతానికి భిన్నగా గట్టిగా మాట్లాడుతున్నారు. ఒకనాటి శాంతస్వభావులు కూడా ఇపుడు పరుషంగా గొంతు విప్పుతున్న పరిస్థితి. మాకు శాంత వచనాలు వద్దు బాబు గారు. మీ మాట వినం అన్న వారి సంఖ్య నానాటికీ టీడీపీలో పెరిగిపోతోంది. వీరితో పాటు చంద్రబాబే తన పొలిటికల్ ఫిలాసఫీని మార్చుకోవాల్సి వస్తోంది.

బాబు కూడా గతానికి భిన్నంగా బిగ్ సౌండ్ చేయడం వెనక తమ్ముళ్ల వత్తిడే ఉంది. తాజాగా గుంటూరు జిల్లా చిలకఊరిపేటకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన ప్రత్తిపాటి పుల్లారావు అయితే ఈసారి బాబు చెప్పినా వినే ప్రసక్తి లేదు అనేశారు. తన నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలలో చేసిన కామెంట్స్ అయితే వేడిని పుట్టిస్తున్నాయి.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. అదే టైంలో పొత్తులు లేకుండానే 160 సీట్లు సాధిస్తామని ప్రత్తిపాటి సవాల్ చేస్తూ మాట్లాడారు, అంతటితో ఆగని ఆయన రేపటి రోజున అధికారంలోకి రాగానే వైసీపీ నేతల వీపులు పగలగొట్టడం ఖాయం అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈ విషయంలో బాబు గారు నో అన్నా ఊరుకునే ప్రసక్తే లేదు. అతి చేస్తున్న వైసీపీ లీడర్ల జాబితాను రెడీ చేస్తున్నామని, వారికి ఇక బడిత పూజే పూజ అంటూ వార్నింగ్ ఇచ్చేశారు.

మా సహనానికి పరీక్ష  పెట్టారు. మూడేళ్ళుగా వేగలేకపోయాం, ఇక ఆగేది అసలు లేదు అంటున్నారు పుల్లారావు, ఇక జగన్ ఈ జన్మలో సీఎం కాడు అని కూడా అనేశారు. ఆయన జగన్ పాలనను లేకుండా చేయడానికి ఏపీ జనాలు కంకణం కట్టుకున్నారు అని పుల్లారావు చెప్పడమూ విశేషమే.

ఇక పల్నాడు లో చూస్తే ఆ మధ్యన  టీడీపీ కార్యకర్త జాలయ్యను వేటకొడవల్లతో నరికారు అని తమ్ముళ్లు అంటున్నారు. అనేక కేసులు టీడీపీ నేతల మీద పెడుతున్నారని వాపోతున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు మీద అయితే ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టారు. ఆయన గుంటూరు జిల్లాలో ఎన్టీయార్ సుజల స్రవంతి పధకం కింద వాటర్ ప్లాంట్ ని తిరిగి ప్రారంభించిన నేపధ్యంలో ఈ కేసులు పెట్టారని అంటున్నారు. దాంతో ప్రత్తిపాటిలో ఆగ్రహం ఒక లెవెల్ లో కట్టలు  తెంచుకుంది. అంతే బాబు చెప్పినా వినమంతే. వీపులు పగులుట ఖాయమని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు.