Begin typing your search above and press return to search.

రెండో రోజు పాదయాత్రలో లోకేశ్ నడక 9.3 కిలోమీటర్లు

By:  Tupaki Desk   |   29 Jan 2023 10:00 AM GMT
రెండో రోజు పాదయాత్రలో లోకేశ్ నడక 9.3 కిలోమీటర్లు
X
యువగళం పేరుతో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర రెండో రోజు పూర్తి అయ్యింది. శనివారం ఉదయం పది గంటలకు మొదలైన పాదయాత్ర.. రెండో రోజు నడక ముగిసే సమయానికి లోకేశ్ 9.3 కిలోమీటర్ల నడకను పూర్తి చేశారు. తన పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాల వారిని కలుసుకున్న లోకేశ్.. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తన నడకలో భాగంగా పొలాల్లోకి వెళ్లటం.. వారితో మాట్లాడటం.. వారి సమస్యల గురించి అడగటం.. వారు చెప్పే విషయాల్ని వింటూ ముందుకు సాగారు. జగన్ సర్కారు తమ పట్ల కక్ష్యతో వ్యవహరిస్తున్న విషయాల్ని లోకేశ్ కు చెప్పినప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు.

తొలిరోజు పాదయాత్ర ముగిసిన తర్వాత బస చేసిన గుడుపల్లె మండలం నల్లగామపల్లెలోని పీఈఎస్ ప్రాంగణ నుంచి రెండో రోజు పాదయాత్ర మొదలైంది. శనివారం సాయంత్రం శాంతిపురం సమీపంలో యాత్రకు విరామం ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.10కోట్లతో ప్రారంభించిన వాల్మీకీ.. కురుబ కమ్యూనిటీ హాళ్లను పరిశీలించాచు. వీటి నిర్మాణ పనుల్ని వైసీపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని అక్కడి బీసీలు చెప్పటంతో లోకేశ్ ఆవేదన చెందారు.

అక్కడి స్థలాల్ని వైసీపీ నేతలు కబ్జా చేయటంతో పాటు.. ఆ భవనాల్ని బెల్టు షాపులుగా మార్చేసిన వైనాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం డిగ్రీ కాలేజీ విద్యార్థులు పలువురు లోకేశ్ ను కలుసుకున్నారు. విద్యా దీవెన.. వసతి దీవెన తమకు అందలేదని.. చేతి నుంచి డబ్బులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. కొత్త కోర్సులు పెట్టినా ల్యాబులు ఏర్పాటు చేయలేదంటూ తమ సమస్యల్ని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యల్ని పరిష్కరిస్తామన్న భరోసాను ఇచ్చారు.

పాదయాత్రలో భాగంగా కనుమల దొడ్డి టమాట మార్కెట్ లో రైతులతో భేటీ అయిన లోకేశ్.. గిట్టుబాటు ధర లేని కారణంగా పంటను రోడ్ల మీద పడేస్తున్నామన్నారు. తాను ముఖ్యమంత్రిని అయితే టమోట సాస్ ఫ్యాక్టరీ పెడతానన్న జగన్ ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారన్న లోకేశ్.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ ప్రభుత్వంలో టమోట రైతులకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. మొత్తంగా చూస్తే రెండో రోజు పాదయాత్రలో పలు వర్గాల వారు ఎదుర్కొంటున్న మస్యల గురించి అడిగి తెలుసుకొని.. అందుకు తగ్గ పరిష్కారాల్ని తాము చేపడతామన్న భరోసాను ఇస్తూ ముందుకు సాగుతున్నారు.