Begin typing your search above and press return to search.

అచ్చెన్నను దగ్గరుండి గెలిపిస్తున్న వైసీపీ

By:  Tupaki Desk   |   28 May 2023 10:00 PM GMT
అచ్చెన్నను దగ్గరుండి గెలిపిస్తున్న వైసీపీ
X
శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి ఎదురులేదు. ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాల రాజకీయం. ఎర్రన్నాయుడుతో 1983లో ఎంట్రీ ఇస్తే ఈ రోజుకీ ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు, కొడుకు రామ్మోహన్ నాయుడు, కూతురు ఆదిరెడ్డి భవానీ ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. ఇక అచ్చెన్నాయుడు విషయానికి వస్తే చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్నారు. 1996లో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన అచ్చెన్నాయుడు హరిశ్చంద్రపురం నుంచి మూడు సార్లు గెలిచారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో ఆ నియోజకవర్గం పోయింది. దాంతో ఆయన టెక్కలికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఫస్ట్ టైం 2009లో టెక్కలిలో ఓడారు.

అయితే 2014, 2019లలో గెలిచారు. ఇలా అయిదు సార్లు అచ్చెన్న ఎమ్మెల్యేగా అయిదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన వెలమ నేతగా ఆయన ఉన్నారు. టెక్కలిలో రెండు సార్లు వరసగా గెలిచిన అచ్చెన్న మీద జనాలలో కొంత వ్యతిరేకత ఉంది. అయితే దాన్ని సొమ్ము చేసుకుందామని చూస్తున్న వైసీపీ టెక్కలిలో తప్పటడుగులే వేస్తోంది.

అక్కడ కేంద్ర మాజీ మంత్రి ప్రజలలో ఎంతో పేరు ఉన్న డాక్టర్ కిల్లి కృపారాణి ఉన్నారు. ఆమెకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారని అంటున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ వైపు జగన్ మొగ్గు చూపారు. ఆయన అచ్చెన్నను పట్టుకుని నానా మాటలు అంటారని, ఆయన్ని గట్టిగా నిలదీస్తారని కారణంతో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయితే దువ్వాడకు జనంలో ఫాలోయింగ్ లేదని,సొంత పార్టీలో సైతం ఆయనకు ఎవరితో పడదని చెబుతారు.

ఆయనకు టికెట్ ఇస్తే పనిచేయమని కిల్లి కృపారాణి వర్గం, 2019లో టెక్కలి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కాళింగ కార్పోరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ వంటి వారు అంటున్నా ఆయనే టెక్కలి వైసీపీ అభ్యర్ధి అని నెల రోజుల క్రితం శ్రీకాకుళం మూలపేట పోర్టు కి శంకుస్థాపన సందర్భంగా జగన్ ప్రకటించారు. అయితే ఇంతలో దువ్వాడ కుటుంబంలోనే విభేదాలు వచ్చాయి. ఆయన సతీమణికి దువ్వాడకు పడడం లేదు.

దాంతో భార్యాభర్తల ఇద్దరి పంచాయతీ జగన్ వద్దకు చేరడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా దువ్వాడ వాణిని టెక్కలి ఇంచార్జిగా చేశారు. ఇదిలా ఉంటే ఆమె టెక్కలి నుంచి జెడ్పీటీసీగా ఉన్నారు. ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆడపడుచు. ఆమె తండి సంపతి రాఘవరావు కాంగ్రెస్ లీడర్. ఆయన వారసురాలిగా 2004లో హరిశ్చంద్రపురం నుంచి దువ్వాడ వాణి అచ్చెన్నాయుడు మీద తొలిసారి పోటీ చేస్తే అమెకు 33 వేల పై చిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే అచ్చెన్నకు 70 వేల పై చిలుకు వచ్చాయి. ఆలా రెట్టింపు ఓట్లతో అధిక మెజారిటీతో వైఎస్సార్ వేవ్ లోనే అచ్చెన్న గెలిచారు.

ఇపుడు అంటే రెండు దశాబ్దాల తరువాత దువ్వాడ వాణి మళ్లీ వైసీపీ నుంచి టెక్కలి నుంచి పోటీ చేస్తే అచ్చెన్నను ఏలా ఓడించగలరన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంతే కాదు ఈసారి జగన్ వేవ్ కూడా లేదు. టీడీపీకి అనుకూల పవనాలు ఉన్నాయి. దాంతో అచ్చెన్న ఈజీగా గెలుస్తారు అని అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ 2014లో అచ్చెన్న మీద పోటీ చేసి ఓడారు. ఈసారి గెలుస్తాను అంటూ వచ్చినా కుటుంబ గొడవల వల్ల టికెట్ కోల్పోయారు. ఇపుడు వాణికి టికెట్ ఇచ్చినా పార్టీలో ప్రత్యర్ధి వర్గాలు సహకరిస్తాయన్న నమ్మకం అయితే లేదు.

టోటల్ గా తేలేది ఏంటి అంటే అచ్చెన్న హ్యాపీగా టెక్కలి సీటు గెలవవచ్చు అని. ఈ విషయంలో వైసీపీ హై కమాండ్ టెక్కలిలోని వైసీపీ లీడర్స్ అందరితో చర్చించి సరైన అభ్యర్ధిని నిలబెట్టి ఉంటే గట్టి పోటీ ఇచ్చినట్లుగా ఉండేదని అంటున్నారు. ఏది ఏమైనా అచ్చెన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని అపుడే తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు.