వచ్చే ఎన్నికలపై టీడీపీ డిజిటిల్ సర్వే తేల్చింది ఇదేనా?

Tue Jan 24 2023 19:00:01 GMT+0530 (India Standard Time)

TDP Digital Survey on Elections

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా ఇప్పటికే వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే అధికార వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జులు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు కలిగిన లబ్ధిని వివరిస్తున్నారు.మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సైతం బాదుడే బాదుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర కూడా మొదలుకానుంది. మొత్తం 4 వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయనున్నారు.

మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ సైతం తన వారాహి వాహనంతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర జనవాణి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆయా పార్టీలు రహస్య సర్వేలు చేయిస్తున్నాయని టాక్. ఇందులో భాగంగా టీడీపీ ఎన్నారై ఒకరు డిజిటల్ సర్వే చేయించారని ఇందులో టీడీపీకి ఆశాజనకమైన ఫలితాలే వచ్చాయి చెబుతున్నారు. అయితే ఇది డిజిటల్ సర్వే కావడం.. తీసుకున్న శాంపుల్ తక్కువే కావడం వల్ల ఇది శాస్త్రీయమైనది భావించడానికి వీల్లేదని అంటున్నారు.

అయితే ఇలాంటి సర్వేలు ఎన్నికల ముందు ఆసక్తి కలిగించడం సహజం. ఈ నేపథ్యంలో ఈ డిజిటల్ సర్వే ప్రకారం.. నెల్లూరు జిల్లాతో కలుపుకుని గ్రేటర్ రాయలసీమలో ఇప్పటికీ వైసీపీనే ఆధిక్యంలో ఉందని తేలిందట. టీడీపీతో పోలిస్తే వైసీపీకే రాయలసీమలో ఎక్కువ సీట్లు వస్తాయని సర్వే తేల్చిందని ప్రచారం సాగుతోంది. ఇక రాజధాని కాకరేపుతున్న ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీతో పోలిస్తే టీడీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని వెల్లడైంది. వైసీపీ కొన్ని సీట్లు సాధించినప్పటికీ టీడీపీదే మెజారిటీగా ఉండనుంది.

ఇక ఉత్తరాంధ్రలో మాత్రం వైసీపీకి గట్టిదెబ్బ తగలడం ఖాయమని సర్వే తేల్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ తోపాటు మంత్రులు సీదిరి అప్పలరాజు ధర్మాన ప్రసాదరావులకు ఓటమి తప్పదని సర్వే తేల్చిందని సమాచారం. వీరిపై ఉన్న అవినీతి ఆరోపణలు సొంత పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తి వీరి ఓటమికి దారితీస్తాయని సర్వే తేల్చింది. ఇక విశాఖ రాజధానిపైన ఆశలు పెట్టుకున్న విశాఖపట్నం జిల్లాలో వైసీపీ అనుకున్నట్టు ఫలితాలు ఉండబోవని సర్వే స్పష్టం చేసింది.

రాజధానిగా విశాఖ ఉంటే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది విశాఖ రాజధానిగా అవసరం లేదనే అభిప్రాయం సర్వేలో వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ వైసీపీలకు సమాన సంఖ్యలో సీట్లు వస్తాయని డిజిటల్ సర్వే స్పష్టం చేసిందని అంటున్నారు.

అయితే జనసేనతో టీడీపీ కలిసి పోటీ చేస్తుందా? జనసేన పార్టీ పరిస్థితి? బీజేపీ పరిస్థితి ఏమిటనే విషయాలపై ఈ డిజిటల్ సర్వే ఏం తేల్చకపోవడం గమనార్హం. కేవలం వైసీపీ టీడీపీ రెండు పార్టీలే అన్నట్టు సర్వే సాగిందని చెబుతున్నారు. అందులోనూ డిజిటల్ సర్వే కావడం తీసుకున్న శాంపిల్స్ తక్కువే కావడం వల్ల ఈ డిజిటల్ సర్వేను విశ్వసించాల్సిన అవసరం లేదని అంటున్నారు.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.