గోవాలో డ్యాన్స్ మాస్టర్ 'టీనా సాదు' అనుమానాస్పద మృతి?

Fri May 13 2022 06:40:43 GMT+0530 (IST)

Suspicious death of dance master 'Tina Sadu' in Goa?

టాలీవుడ్ కొరియోగ్రాఫర్..టీవీ షో 'ఆట' ఫేం టీనా సాధు అనుమానాస్పద రీతిలో గోవాలో మరణించారు. బుధవారం  ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా చెబుతున్నారు. ఓంకార్ ప్రొడ్యూస్ చేసిన 'ఆట' డ్యాన్స్ రియాల్టీ షోకు అప్పట్లో ఉన్న ఆదరణ ఎంతన్నది తెలిసిందే. ఆట సీజన్ వన్ టైటిల్ విన్నర్ గా ఆమె నిలిచారు.అదే షోకు నాలుగో సీజన్ కు వచ్చేసరికి ఆమె..షోలోని జడ్జిల స్థానంలో నిలిచారు. తర్వాతి కాలంలో కొరియోగ్రఫీ చేసిన ఆమె మహారాష్ట్రకు చెందిన వారు. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం హైదరాబాద్ లోనే ఉంటారని చెబుతారు.

ఆమె మరణించిన విషయాన్ని ఆమెకు మంచి స్నేహితుడిగా చెప్పే మరో కొరియోగ్రాఫర్ 'ఆట' సందీప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆమె కొంతకాలంగా గోవాలోనే ఉంటున్నారు. అయితే.. గోవాలో అసలేం జరిగింది? ఆమె మరణానికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నా.. చిన్న వయసులో ఇలాంటి అవకాశం ఉందా? అన్న అనుమానాలు ఉన్నాయి.

రెండు.. మూడు రోజుల క్రితమే గోవా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆమె తన స్నేహితురాలు కమ్ ప్రముఖ యాంకర్ శిల్పను కూడా కలిసినట్లు చెబుతున్నారు. తాను మళ్లీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆమె మరణ వార్త పలువురిని షాక్ కు గురి చేసింది. ఆమె మరణంపై గోవా పోలీసులు అనుమానాస్పద మరణంగా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వారి విచారణలో కొత్త విషయాలు తెలిసే వీలుందన్న మాట వినిపిస్తోంది.