Begin typing your search above and press return to search.

అమెరికా రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట కుర్రాడు దుర్మరణం

By:  Tupaki Desk   |   29 Nov 2021 1:30 PM GMT
అమెరికా రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట కుర్రాడు దుర్మరణం
X
మూడు వారాలు.. మరికాస్త కచ్ఛితంగా చెప్పాలంటే కేవలం 17 రోజుల్లో సూర్యాపేటకు రావాల్సిన తెలుగు కుర్రాడు.. తాజాగా అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఉదంతం అయ్యో అనేలా మారింది. కుటుంబ సభ్యుల రోదనలకు కన్నీళ్లు పెట్టని వారు లేరు. అసలేం జరిగిందంటే..
సూర్యాపేటకు చెందిన నరేంద్రుని చిరుసాయి (22) విజయవాడలో బీటెక్ పూర్తి చేశాడు. ఎంఎస్ చేయటానికి పదకొండు నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఓహియోలో ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు.

డిసెంబరు 15న భారత్ కు తిరిగి రావటానికి వీలుగా టికెట్లు బుక్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా షాపింగ్ చేసేందుకు నల్గొండ జిల్లాకు చెందిన స్నేహితురాలు లావణ్యతో కలిసి కారులో బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో కారులో తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో భారీగా మంచు కురుస్తోంది.

ఈ సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్.. వీరి కారును గుర్తించటంలో జరిగిన పొరపాటు.. భారీ యాక్సిడెంట్ కు కారణమైంది. టిప్పర్ వీరి కారును ఢీ కొట్టటంతో.. కారు డ్రైవ్ చేస్తున్న చిరు సాయి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. కారులో ఉన్న లావణ్య తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లింది.

చిరుసాయి సోదరి మేఘన పెళ్లి అనంతరం అమెరికాలోనే స్థిరపడ్డారు. సోదరుడి దుర్మరణం గురించి తెలుసుకున్న ఆమె.. సూర్యపేటలోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

దీంతో.. వారు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో 17 రోజుల్లో ఇంటికి రావాల్సిన వాడు.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రమాదానికి జరగానికి కొన్ని గంటల ముందే కొడుకుతో చాలాసేపు ఫోన్లో మాట్లాడినట్లుగా తల్లిదండ్రులు గుర్తు చేసుకొని రోదిస్తున్నారు. చిరుసాయి భౌతికకాయాన్ని సూర్యాపేటకు తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయం కోరుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని కోరుతున్నారు.