Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో జడ్జిలను దూషించటంపై సుప్రీం కీలక తీర్పు

By:  Tupaki Desk   |   31 May 2023 11:00 AM GMT
సోషల్ మీడియాలో జడ్జిలను దూషించటంపై సుప్రీం కీలక తీర్పు
X
మనసుకు తోచించి బయటకు చెప్పేయటం ఏ మాత్రం సంస్కారం కాదు. అందునా విమర్శలు చేయటం.. నిందలు వేయటం.. ఆరోపణలు చేయటం లాంటివి చేసే ముందు ఒకటికి రెండుసార్లు బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా మనసుకు తోచింది తోచినట్లుగా పోస్టులు పెట్టేస్తున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

చివరకు న్యాయమూర్తుల మీద కూడా ఇలాంటి పోస్టులు పెడుతున్న వైనాలు షాక్ కు గురి చేస్తున్నాయి. తమ వద్ద సరైన ఆధారాలు ఉంటే ఫర్లేదు కానీ.. అలాంటిదేమీ లేకుండా తీర్పు పాఠాన్ని పూర్తిగా చదవకుండా తమకు తోచిన మాటను పోస్టు రూపంలో పెట్టేసి.. న్యాయమూర్తుల మీద ముద్రలు వేస్తున్న వారి విషయంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.

సోషల్ మీడియా ద్వారా న్యాయమూర్తులను దూషించే వారిని శిక్షించటం సబబే అన్న విషయాన్ని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. తమకు అనుకూలంగా తీర్పు రానంత మాత్రాన జడ్జిలను దూషించలేరన్న అత్యున్నత న్యాయస్థానం.. న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచే కాదు.. బయట వ్యక్తుల నుంచి కూడా స్వతంత్రంగా ఉండటమనే అర్థాన్ని గుర్తు చేసింది.

ఇంతకూ ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ లోని దేవాలయానికి సంబంధించి కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపైన కృష్ణ కుమార్‌ రఘువంశి అనే వ్యక్తి సోషల్ మీడియాలో దారుణ వ్యాఖ్యలతో పోస్టు పెట్టారు. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది. తీర్పు చెప్పిన జడ్జిపైన అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి పది రోజులు జైలుశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు.

మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేల ఎం త్రివేది.. జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రాల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. తమకు అనుకూలంగా తీర్పు రాకుంటేూ జడ్జిని దూషించలేరని పేర్కొంది.

హైకోర్టు తీర్పు మరీ కఠినంగా ఉందని.. కనికరం చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ఇలాంటి వాటిని క్షమించలేది లేదని స్పస్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవటానికి సుప్రీంకోర్టు నో చెప్పింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారు.. కాసింత జాగ్రత్తగా ఉండాలన్నట్లుగా తాజా తీర్పు ఒక హెచ్చరికగా చెప్పక తప్పదు.