జీవిత ఖైదు అనుభవించిన వ్యక్తికి మళ్లీ పదేళ్ల శిక్ష.. సుప్రీం సంచలన తీర్పు!

Sun Aug 01 2021 19:13:21 GMT+0530 (IST)

Supreme Court verdict

మన దేశంలో ప్రత్యేకమైన అరుదైన కేసుల్లో మాత్రమే మరణ శిక్ష విధిస్తారు. మిగిలిన ఎలాంటి కేసులోనైనా గరిష్టమైన శిక్ష జీవిత ఖైదు. ఇది పద్నాలుగేళ్లు ఉంటుంది. అయితే.. ఈ శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఓ వ్యక్తికి.. పదేళ్ల జైలు శిక్ష విధించింది కింది కోర్టు. దీంతో.. బాధితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. విచారించిన న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇమ్రాన్ జలీల్ అనే వ్యక్తికి కోర్టు గతంలో జీవిత ఖైదు విధించింది. అయితే.. సదరు శిక్ష సక్రమంగా అనుభవించలేదని మరోసారి పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది కన్నడలోని ఓ ట్రయల్ కోర్టు. దీంతో.. ఇది అన్యాయమంటూ ఇమ్రాన్ జలీల్ అత్యున్నత ధర్మాసనం సుప్రీంను ఆశ్రయించాడు.

ఇమ్రాన్ తరపున సిద్ధార్థ్ దవే అనే సీనియర్ లాయర్ వాదించారు. జీవిత ఖైదు అనేది మనిషికి అతిపెద్ద శిక్ష అని దాని తర్వాత మరో శిక్ష విధించే అవకాశం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే జీవించే హక్కు ఉన్నప్పుడు.. జీవిత ఖైదు కూడా ఒకసారే ఉంటుందని ఆ తర్వాత మళ్లీ ఖైదు చేయడం సమంజసం కాదని దవే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. జస్టిస్ యూయూ లలిత్ జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలోని బెంచ్ ఇమ్రాన్ జలీల్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది.

ఒకసారి జీవిత ఖైదు విధిస్తే.. అప్పటి వరకూ జీవితంలో చేసిన అన్ని నేరాలకూ కలిపి ఆ శిక్ష వర్తిస్తుందని స్పష్టం చేసింది సుప్రీం. కాబట్టి.. జీవిత ఖైదు తర్వాత మరో శిక్ష విధించడం సరికాదని తేల్చి చెప్పింది. కర్నాటక ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.