Begin typing your search above and press return to search.

కరోనా దెబ్బ.. ఆ దేవుడికే తప్పలేదు

By:  Tupaki Desk   |   18 Jun 2020 12:10 PM GMT
కరోనా దెబ్బ.. ఆ దేవుడికే తప్పలేదు
X
దేశంలో ప్రముఖ పవిత్ర చారిత్రాత్మక పూరీ జగన్నాథ రథయాత్రకు బ్రేక్ పడింది. రథచక్రాలు ఆగిపోనున్నాయి. దీనికంతటికి కారణం కరోనా దెబ్బ. అవును.. ఒడిషా రాష్ట్రంలోని ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుడి రథయాత్రను ఈ సంవత్సరం నిర్వహించవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జూన్ 23న నిర్వహించనున్న ఈ ఉత్సవానికి బ్రేక్ పడనుంది.

కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న దృష్ట్యా సమూహాల వేడుకలపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోనే అందరూ కొలిచే పూరి జగన్నాథుడి రథోత్సవం వేడుకలను ఈసారి కరోనా కారణంగా రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశ విదేశాల నుంచి పదిలక్షల మంది వచ్చే ఈ వేడుక ఈసారి జరగదని తెలుస్తోంది.

జగన్నాథుడి రథయాత్రను ఈసారి నిలిపివేయాలని కోరుతూ ఒడిషాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు అంత పెద్ద రథయాత్రకు అంగీకరిస్తే కరోనా బాగా వ్యాపిస్తుందని.. అందుకని ఈసారి జగన్నాథుడి రథయాత్రను ఆపాలని ఆదేశించారు. జగన్నాథుడి రథచక్రాలను ఆ కరోనా మహమ్మారి కారణంగా ఆపాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ప్రజల పౌరుల రక్షణ, ఆరోగ్యం దృష్ట్యానే ఈ చారిత్రక రథయాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఒడిషా ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రథయాత్రకు సంబంధించి ఏ వేడుకలు నిర్వహించవద్దని సూచించింది.