Begin typing your search above and press return to search.

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   14 Sep 2021 6:47 AM GMT
కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X
పెళ్లి కాని లేదా వితంతు కుమార్తెకు మాత్రమే తమ తల్లి, లేదా తండ్రికి చెందిన కారుణ్య నియామకం వర్తిస్తుందని కర్ణాటకకు చెందిన ఒక కేసు విషయంలో దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ఉద్యోగి చనిపోయే నాటికి అలాంటి వారు ఆ ఉద్యోగితో కలిసి నివాసం ఉంటున్నప్పుడే వారిని ఆధారపడినవారుగా పరిగణిస్తామని, నియామక అర్హత వారికే ఉంటుందని తేల్చిచెప్పింది. కర్ణాటక సివిల్‌ సర్వీసు (కారుణ్య నియామకాలు) నిబంధనలు- 1996 పై సమీక్ష సందర్భంగా జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఉద్యోగిగా ఉన్న తల్లి చనిపోయిన తేదీ తర్వాత కుమార్తె విడాకులు తీసుకుని, కారుణ్య నియామకానికి అర్హత పొందాలని ప్రయత్నించడాన్ని తప్పు అని తీర్పు వెల్లడించింది. అయితే ఇదే ఏడాది ఓ ఉద్యోగి చనిపోయినప్పుడు కారుణ్య నియామకం కింద అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే క్రమంలో పెళ్లికాని కుమార్తె మాత్రమే అర్హురాలని పేర్కొవడాన్ని ఏపీ న్యాయస్థానం తప్పుబట్టింది. పెళ్లయిందన్న కారణంతో కుమార్తె పుట్టింటి కుటుంబంలో సభ్యురాలు కాదనడం దారుణమని వ్యాఖ్యానించింది. కారుణ్య నియామక అర్హతలలో అవివాహిత అనే పదాన్ని చేర్చడం రాజ్యాంగవిరుద్ధమని, ఆ పిటిషనర్‌ కు కారుణ్య నియామకం కింద తగిన ఉద్యోగం కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీర్పు వెలువరించారు.

కుమారుడికి వివాహమైన వారికి ఎలాంటి షరతూ విధించలేదు.. కుమారులు, కుమార్తెలు పెళ్లి చేసుకున్నారా.. లేదా? అనే అంశంతో సంబంధం లేకుండా జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో వారు భాగమే. కుమార్తెకు పెళ్లయినంత మాత్రాన ఆమెను పుట్టింటి కుటుంబంలో సభ్యురాలు కాదని చెప్పడం దారుణం. కుమారులు, కుమార్తెలకు తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, విధులు ఉంటాయి అని హైకోర్టు తెలిపింది. తల్లిదండ్రులు కన్నుమూస్తే.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన, కుటుంబ బాధ్యతలను మోస్తున్న ఎందరో కుమార్తెలను చూస్తున్నాం. తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టంలో ‘పిల్లలు’అనే నిర్వచనం కిందకు కుమారుడు, కుమార్తె, మనవడు, మనవరాలు వస్తారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు కుమార్తెకు పెళ్లయిందా.. లేదా అనే వ్యత్యాసాన్ని పార్లమెంటు చూపలేదు. వివాహమైనా తల్లిదండ్రులను చూసుకునే బాధ్యతను ఈ చట్టం తీసేయలేదు. తల్లిదండ్రుల అవసరాలు తీర్చే బాధ్యత పెళ్లయిన కుమార్తెలపైనా ఉంది.