Begin typing your search above and press return to search.

వివేకా హ‌త్య కేసులో అనేక సంచ‌ల‌నాలు.. సుప్రీం ఆదేశం

By:  Tupaki Desk   |   29 March 2023 4:09 PM GMT
వివేకా హ‌త్య కేసులో అనేక సంచ‌ల‌నాలు.. సుప్రీం ఆదేశం
X
ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో తాజాగా బుధ‌వారం అనేక సంచ‌ల‌నాలు చోటు చేసుకున్నాయి. ద‌ర్యాప్తు అధికారిని సుప్రీంకోర్టు మార్చేసింది. అదే స‌మ‌యంలో ద‌ర్యా ప్తును ఏప్రిల్ 30లో గా పూర్తి చేయాల‌ని కూడా నిర్దేశించింది. మొత్తానికి ఇంకా మ‌రిన్నిసంచ‌లన నిర్ణ‌యాల ను కూడా సుప్రీం కోర్టు ప్ర‌క‌టించింది. అలాగే కొత్త సిట్ ఏర్పాటు ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అంగీక‌రించింది.

ఈ హత్య కేసు దర్యాప్తుకు సంబంధించి ఏ5 నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై కీలక తీర్పునిచ్చింది.

వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును ఏప్రిల్ 30లోగా విచారణను ముగించాలని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. అలాగే ఇప్పటి వరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ ర్యాంక్ అధికారి రాంసింగ్‌ను తొలగించి... అదనంగా మరో సిట్‌ను ఏర్పాటు చేసింది.

డీఐజీ కేఆర్ చౌరాసియా పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగనుంది. కొత్త సిట్‌లో ఐపీఎస్ అధికారి, ఎస్పీ వికాస్ కుమార్, అడిషన్ ఎస్పీ ముఖేష్ శర్మ, ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీమతి, మరో ఇన్‌స్పెక్టర్ నవీన్ పునియా, సబ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ యాదవ్ సభ్యులుగా ఉండనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కొత్త సిట్‌ను ఏర్పాటు చేసింది.

మార్పు ఎందుకంటే..

రాంసింగ్ పర్యవేక్షణలో విచారణ ఆలస్యమవుతోందని ఆయనను తొలగించాలంటూ మొదటి నుంచి సుప్రీం చెబుతోంది. ఈ నెల 27న జరిగిన విచారణ సందర్భంగా.. అవసరమైతే రాంసింగ్‌ను ఉంచండి.. రాంసింగ్‌కు అదనంగా మరో అధికారిని కూడా నియమించండి ధర్మాసనం తెలిపింది. అయితే, ఈ రోజు మరో అధికారిని నియమిస్తూ సీబీఐ నివేదిక ఇచ్చిన క్రమంలో రాంసింగ్‌ను కొనసాగించడంపై సుప్రీం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

రాంసింగ్ వల్లే వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సీబీఐపై ఉన్నతన్యాయస్థానం మండిపడింది. కొత్త సిట్ ఏర్పాటును ధర్మాసనం అంగీకరించింది. ఈ కేసులో విస్తృత కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకురావాలని.. ఏప్రిల్ 30 నాటికి విచారణను ముగించాలంటూ సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.