Begin typing your search above and press return to search.

ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్దమేనన్న సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   20 Jan 2022 8:55 AM GMT
ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్దమేనన్న సుప్రీంకోర్టు
X
నీట్ పీజీ కౌన్సిలింగ్ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్దమేనని తేల్చిచెప్పింది. మెరిట్ కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది.

ఇటీవల నీట్ పరీక్షల్లో ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం రిజర్వేషన్లను రూ. 8 లక్షల క్రిమీలేయర్ ఆధారంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం జనవరి 7వ తేదీన తీర్పు వెలువరించింది. అయితే ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టు సుధీర్ఘంగా ఉత్తర్వులు వెలువరించింది.

2021-22 విద్యాసంవత్సరం నుంచి పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తామంటూ కేంద్రప్రభుత్వం 2021 జులైలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది అభ్యర్థులు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేయకుండానే ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపచేసేందుకు రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అకడమిక్ సెషన్ నుంచి ఓబీసీ, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు అమలు చేయరాదని.. ఈ కారణంగా నీట్ పీజీ కౌన్సిలింగ్ ఆలస్యమవుతోందని నిరసిస్తూ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు.

దీనికి కేంద్రం స్పందించింది. ప్రస్తుత కౌన్సిలింగ్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ కేసు తుది తీర్పునకు లోబడి భవిష్యత్తు రిజర్వేషన్లు అర్హతలు ఆధారపడి ఉంటాయని పేర్కొంది. ఈ కేసు విచారణను మార్చి చివరి వారంలో చేపడుతామని సుప్రీంకోర్టు పేర్కొంది.