Begin typing your search above and press return to search.

సుజనా చౌదరి షాక్‌.. మెడికల్‌ కాలేజీ గుర్తింపు రద్దు..

By:  Tupaki Desk   |   30 May 2023 7:07 PM GMT
సుజనా చౌదరి షాక్‌.. మెడికల్‌ కాలేజీ గుర్తింపు రద్దు..
X
తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరాక ఇప్పటిదాకా సుజనాచౌదరిని టచ్ చేయలేదు. బీజేపీ ఎంపీగా ఉండడం.. కేంద్రంలో పరిచయాలతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చాడు. అయితే ఇప్పుడు బీజేపీ రాజ్యసభ పదవీకాలం పోవడంతో సుజనా చౌదరికి కష్టాలు వచ్చిపడ్డాయి. కేంద్రంలో ఏం పనులు కావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా గట్టి షాక్ తగిలింది.

బిజెపి సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు సంబంధించిన మెడికల్‌ కాలేజీ గుర్తింపు రద్దు చేస్తూ జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ ఆర్డర్‌ జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుండే అడ్మిషన్లు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపింది.

ఘనపూర్‌లో సుజనాచౌదరికి మెడిసిటీ పేరుతో వైద్య కళాశాల ఉంది. ఈ కళాశాల కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఈ కళాశాల గుర్తింపును నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి అప్పట్లో బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ నుండి మొత్తం ముగ్గురు రాజ్యసభ సభ్యులు అప్పట్లో బిజెపిలో చేరారు. వీళ్లందరినీ చంద్రబాబు నాయుడే బిజెపిలోకి పంపారనే ప్రచారం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. సుజనా చౌదరిపై సిబిఐ, ఈడీ కేసులు కూడా ఉన్నాయి. బిజెపి చేరాక ఆయన కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపడం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం బిజెపిలో కీలక నాయకుడుగా ఉన్న సుజనా చౌదరి మెడికల్‌ కాలేజీ గుర్తింపు రద్దు చేయడం గమనార్హం.

అయితే సుజనా చౌదరికి బిజెపిలో పట్టు తప్పిందా అనే అంశం ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఉన్న నలుగురైదుగురు లాబీయిస్టుల్లో సుజనా చౌదరి కూడా ఒకరు. ఏ పనైనా సాధిస్తాడనే పేరు కూడా ఆయనకు ఉంది. అలాంటిది ఆయన మెడికల్‌ కాలేజీ అడ్మిషన్లు నిలిపివేయడం బిజెపి స్థానిక నాయకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇలాంటి ఇబ్బందులు తాత్కాలికమేనని సుజనాచౌదరి అనుచరులు చెబుతున్నారు. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.