Begin typing your search above and press return to search.

సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వ‌ర్సెస్ క‌న్న‌డ సీఎం.. మోడీ పాపానికి మాట‌ల తూటాలు!

By:  Tupaki Desk   |   16 Sep 2021 1:30 PM GMT
సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వ‌ర్సెస్ క‌న్న‌డ సీఎం.. మోడీ పాపానికి మాట‌ల తూటాలు!
X
బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు.. ఫైర్ బ్రాండ్ సుబ్ర‌మ‌ణ్య‌స్వామికి, క‌ర్ణాట‌కలో ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్ బ‌స‌వ‌రాజ బొమ్మైకి మ‌ధ్య మాట‌ల శ‌త‌ఘ్నులు పేలుతున్నాయి. పోక‌చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా! అంటూ. ఇరువురు నేత‌లు.. మాట‌ల తూటాలు సంధించుకుంటున్నారు. దీంతో ఒక్క‌సారిగా బీజేపీ రాజ‌కీయం వేడెక్కింది.

విష‌యం ఇదీ..
పార్టీ ఏదైనా.. ప్ర‌భుత్వంలో ఎవ‌రున్నా.. త‌న దారి త‌న‌దే! అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. సుబ్ర‌మ‌ణ్య స్వామి నైజం. ఈ విష‌యంలో ఆయ‌న ఎవ‌రిమాటా విన‌రు.. వినిపించుకోరు కూడా! కాంగ్రెస్ హ‌యాం అయినా..తన సొంత పార్టీ బీజేపీ నేత‌ మోడీ స‌ర్కారైనా స‌రే.. స్వామికి ఒక్క‌టే! ఆయ‌న ఎప్పుడూ.. హాట్ కామెంట్ల‌తో రాజ‌కీయాలు వేడెక్కిస్తుంటారు. అవ‌కాశం చిక్కితే.. దానిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆయ‌న వ‌దిలి పెట్టుకోరు. ఈ క్ర‌మంలోనే దేశంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్, వంట గ్యాస్ ధ‌ర‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

నేపాల్, శ్రీలంక‌ల‌తో పోల్చినా ఇండియాలో పెట్రో ధ‌ర‌లు భారీగా ఉన్నాయ‌నే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. పెట్రో ధ‌ర‌లు ప్ర‌జ‌ల‌కు శాపంగా మారాయ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు..వాస్త‌వానికి ఇటీవ‌ల పార్ల‌మెంటును కుదిపేసిన‌.. పెగాస‌స్ స్పైవేర్ విష‌యాన్ని రాజేసింది కూడా స్వామేన‌ని అంటారు బీజేపీ నాయ‌కులు. ఈ క్ర‌మంలో చాలా మంది బీజేపీ నేత‌లు.. స్వామిపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. అయితే.. ఎవ‌రూ కూడా నోరు విప్ప‌రు.

బొమ్మై.. దొరికిపోయి..
అయితే.. బీజేపీ నాయ‌కుడు, క‌న్న‌డ సీఎం బొమ్మై మాత్రం .. త‌న‌ను తాను నిగ్ర‌హించుకోలేక పోయారు. సుబ్ర‌మ‌ణ్య‌స్వామిని ఒక ఫ్రీలాన్స్ పొలిటీషియ‌న్ గా అభివ‌ర్ణించారు. సొంత పార్టీల‌పై ఎదురుతిరిగి మాట్లాడ‌టం ఆయ‌న‌కు కొత్త కాద‌న్నారు. అంతేకాదు.. స్వామిని ఉద్దేశించి బ‌హిరంగంగానే కామెంట్లు కుమ్మ‌రించారు. ఇక‌, ఇవి ప్ర‌ధాన మీడియాలో బ్రేకింగ్ ఐటంల మాదిరిగా వైర‌ల్ అయ్యాయి. ఇంకేముంది.. స్వామి ఊరుకుంటారా? వెంట‌నే ఘాటు రిప్ల‌యి ఇచ్చారు.

బొమ్మైని ఉద్దేశించి, నీలా బూట్లు నాకి సీఎం ప‌ద‌విని పొంద‌లేదు అంటూ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి నిప్పులు చెరిగారు. బొమ్మై ముఖ్య‌మంత్రి ప‌ద‌వి పొందిన తీరును ఎద్దేవా చేశారు. బూట్లు నాకి సీఎం అయ్యావంటూ తీవ్రంగా స్పందించారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రి వివాదం హాట్ టాపిక్‌గా మారింది. మున్ముందు.. ఈ మాట‌ల తూటాలు మ‌రిన్ని పేల‌తాయా? లేక ఇక్క‌డితో ఆగుతాయా? అనేది ఆస‌క్తిగా మారింది. మొత్తానికి స్వామి నోట్లో నోరు పెట్టి బొమ్మ‌యి గెల‌వ‌గ‌ల‌రా? అనేది ప్ర‌తి ఒక్క‌రూ సంధిస్తున్న ప్ర‌శ్న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.