ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారు.. ఆరాధించే వారు ఆయన్ను అన్నా అని.. జగనన్నా అంటూ పిలవటం తెలిసిందే. విపక్షాలు ఎంతలా విరుచుకుపడినా.. తన విదేయులతో అలాంటి విమర్శల్ని పెద్దగా పట్టించుకోకుండా తనదైన పాలను చేసుకుంటూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో రెండు తెలుగురాష్ట్రాల్లో ఇప్పటివరకు కనిపించని సరికొత్త కల్చర్ ను తీసుకురావటంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఆయన చేపట్టిన పాలనపై పలువురు పెదవి విరుస్తుంటే.. మా జగనన్న పాలనను వంక పెడతారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే వారు ఉన్నారు.
సంక్షేమమే తన లక్ష్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో సమస్యలకు కొదవ లేదన్న మాట పలువురి నోట వస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి తీరును ప్రదర్శిస్తూ స్కూల్ అమ్మాయిలు చేపట్టిన నిరసన ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం.. తమ సమస్యల్ని హైలెట్ చేసే క్రమంలో ఆ స్కూల్ అమ్మాయిలు ప్రదర్శించిన ప్లకార్డులే కారణం.
అందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని.. 'జగన్ మామ'గా పేర్కొన్నారు. పదో తరగతి చదివే దాదాపు ఇరవై మంది వరకు అమ్మాయిలు నిరసన చేపట్టారు. ఇందుకు పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మారింది. తమ స్కూల్లో టీచర్లు లేరంటూ వారు రోడ్డు మీదకు వచ్చారు.
తాము చదువుతున్నది పదో తరగతి అని.. కానీ తమకు ఉన్న టీచర్లు మాత్రం ఇద్దరేనంటూ వారు చెబుతున్నారు. స్కూల్ లో తమ ఇబ్బందుల్ని ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకపోవటంతో..వారు జగన్ మామా.. ఉపాధ్యాయులు లేరు మామా అంటూ ప్లకార్డులు పట్టుకొని రోడ్ల మీదకు వచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్ అమ్మాయిల్ని తహసీల్దారు వద్దకు తీసుకెళ్లారు. వారి సమస్యను వారంలో తీరుస్తానంటూ మాట ఇవ్వటంతో ప్లకార్డుల ప్రదర్శన ఆగిపోయింది. ఇంతకాలం జగనన్న అంటూ కీర్తించే మాటల్నే విన్న వారికి.. తాజాగా జగన్ మామ పేరుతో నిర్వహించిన నిరసన ప్రదర్శన ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. రానున్న రోజుల్లో జగన్ మామ పేరుతో మరెన్ని నిరసనలు మొదలవుతాయో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.