Begin typing your search above and press return to search.

డాక్టర్ లు బ్రాండ్ నేమ్ వాడితే కఠిన చర్యలే!!

By:  Tupaki Desk   |   18 Jan 2022 8:17 AM GMT
డాక్టర్ లు బ్రాండ్ నేమ్ వాడితే కఠిన చర్యలే!!
X
రోగులకు వైద్యులు ఇచ్చే మందుల చీటీ పై బ్రాండ్ పేరు వాడొద్దని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి తెలిపింది. వైద్యులు రాసే చీటీపై ఎటువంటి బ్రాండ్ పేరు ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రిస్కిప్షన్ పై జనరిక్ మెడిసిన్ పేర్లనే రాయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రిస్కిప్షన్ లో మెడిసిన్ కాంపౌండ్ ను మాత్రమే ప్రస్తావించాలని వైద్య మండలి స్పష్టం చేసింది. బ్రాండ్ పేర్లను రాయకూడదని ఆదేశిస్తూ... సుప్రీంకోర్టు ఆదేశాలను గుర్తు చేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోకాయుక్త కూడా పలు సూచనలు చేసింది. అయితే వాటిని తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వైద్య మండలి సూచించింది.

కొందరు వైద్యులు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండి పడింది. ఇండియన్ మెడిసిన్ కౌన్సిల్, లోకాయుక్త ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను కాలరాస్తూ ప్రిస్కిప్షన్ పై బ్రాండ్ పేర్లను రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పింది. అయితే ఇకపై ఇలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. జనరిక్ మెడిసిన్ మాత్రమే రాయాలని స్పష్టం చేసింది. ఇవి రోగులకు చౌకగా లభిస్తాయని పేర్కొంది.

ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులనే వాడాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. బ్రాండెడ్ మందులను వైద్యులు సూచించడం వల్ల ఔషధ కంపెనీలు వాటికి ఎక్కువ ధరను అమ్ముతున్నాయి. జనరిక్ మందులైతే తక్కువ ధరకు వస్తాయి. అందుకే భారతీయ వైద్యమండలి, లోకాయుక్త సూచనలు గుర్తు చేస్తూ... వాటిని తప్పకుండా పాటించాలని రాష్ట్ర వైద్య మండలి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.