Begin typing your search above and press return to search.

ఆ 4 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసిన స్టాలిన్

By:  Tupaki Desk   |   16 Oct 2021 3:34 AM GMT
ఆ 4 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసిన స్టాలిన్
X
ఆసక్తికర నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్.. ఒక అంశంపై ఊహించని రీతిలో రియాక్టు అయిన వైనం ఆసక్తికరంగా మారింది. గడిచిన కొద్ది సంవత్సరాలుగా హిందువులు జరుపుకునే ప్రతి పండక్కి ఏదో ఒక లింకుతో కాలుష్యం చర్చను తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. అలా అని దేశంలో కాలుష్యం పెరిగిపోవటం లేదని చెప్పటం లేదు. కానీ.. ఇలాంటి కాలుష్య లెక్కలన్ని కూడా హిందువులు జరుపుకునే పండగుల విషయంలోనే ఎందుకన్నది ప్రశ్నగా మారింది. అలా అని తమిళనాడు సీఎం ఇలాంటి ప్రస్తావనను తీసుకురాలేదు. కాకుంటే.. దీపావళి.. వినాయక చవితి.. హోలీ.. సంక్రాంతి.. ఇలా ప్రతి పండక్కి ఏదో ఒక కారణాన్ని ఎత్తి చూపుతూ కాలుష్యానికి కారణమైన పండగను ఇలా చేసుకోవాలి.. అలా చేసుకోవాలన్న క్లాసులు ఎక్కువ కావటంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాశారు. దేశంలో టపాసుల తయారీలో తమిళనాడు అత్యధికంగా చేస్తుంటుంది. అయితే..బాణసంచా మీద నాలుగు రాష్ట్రాలు (ఢిల్లీ.. హర్యానా.. ఒడిశా.. రాజస్థాన్) నిషేధాన్ని విధించిన నేపథ్యంలో స్టాలిన్ వారికి లేఖ రాశారు. బాణసంచా తయారీ మీద 8 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉంటాయని.. నిషేధం పేరుతో వారి పొట్ట కొట్టొద్దన్నారు. సుప్రీంకోర్టు.. జాతీయ హరిత ట్రైబ్యునల్ నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి టపాసుల్ని అమ్మొచ్చని పేర్కొన్నారు.

కరోనా కారణంగా దేశంలోని చిన్న.. మధ్యతరహా పరిశ్రమల రంగం భారీగా దెబ్బ తిందని.. తమిళనాడు ఆర్థిక పరిస్థితిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయాన్ని గుర్తు చేశారు. తమ రాష్ట్రంలోని శివకాశిలో బాణసంచా పరిశ్రమ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకటని.. దీనిపై 8 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇంత భారీగా దేశంలో ఈ పరిశ్రమపై ఆధారపడింది తమ రాష్ట్రమేనని చెప్పారు. వాయు కాలుష్యం కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండొచ్చని.. ఆ విషయం తనకు తెలుసనని.. కానీ సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైన బాణసంచా మీదనే బ్యాన్ పెట్టిందని తన లేఖలో గుర్తు చేశారు. గ్రీన్ క్రాకర్స్ తయారు చేస్తున్నారని.. అవి తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయన్న సీఎం స్టాలిన్..టపాసుల మీద బ్యాన్ సరికాదన్నారు. ఇతర దేశాల్లో ఎక్కడా బ్యాన్ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటిది.. 8 లక్షల మందికి జీవనాధారం అయిన పరిశ్రమ దారుణమైన పరిస్థితుల్లోకి చేరుకోవటంతో పాటు.. వారంతా రోడ్డున పడతారని.. అందుకే మూకుమ్మడి నిషేధం మీద పునరాలోచించాలని స్టాలిన్ కోరటం గమనార్హం.