జనసేన : పిరికి సిఎం... పులివెందుల పులా?

Mon May 16 2022 13:13:26 GMT+0530 (IST)

Srinivas Kusampudi comments on cm jagan

"సీఎం పర్యటించే ఊరిలో అన్ని షాపులు మూసివేయించడం షాపులకు అడ్డంగా ఇనుప పైపులతో బారికేడ్లు ఏర్పాటు చేయడం ఆ మార్గం గుండా వెళ్లే అన్ని వాహనాలు నిలిపివేయడం దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనైనా ఉందా? ఇంత పిరికి సిఎం... పులివెందుల పులా??? "  అని జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కుసుంపూడి ఇవాళ ఎఫ్బీ వేదికగా వ్యాఖ్యలు చేశారు.వాస్తవానికి ఇవాళ సీఎం  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు గణపవరం వచ్చి రైతు భరోసా నిధులు విడుదల చేసి సేద్యగాళ్లకు అండగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల అతి కారణంగా ఎక్కడికక్కడ నిర్బంధాలు రాజ్యమేలుతున్నాయి.

ఈ క్రమంలో సమస్యను ఓ కొలిక్కి తేవడానికి  పోలీసులు ప్రయత్నం చేయడం లేదు సరి కదా ! సీఎం పర్యటన అంటే చాలు ఎక్కడ లేని అత్యుత్సాహాన్నీ ఒంటిపై తెచ్చుపెట్టుకుని మర్యాదల పేరిట ప్రొటొకాల్ పేరిట తెగ  వినయం నటిస్తున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది. అదే అతి ప్రజానీకాన్ని విసిగిస్తోంది.

గతంలో కూడా పోలీసులు ఇదే విధంగా ప్రవర్తించారని మొన్నటికి మొన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వాకిటకు వచ్చిన సీఎంను కలవాలని భావించిన వారికి ఆశాభంగం ఎదురైందని విపక్షం గగ్గోలు పెడుతోంది. మంత్రులే స్వయంగా గృహనిర్బంధాలకు ఆదేశిస్తూ వివాదాలకు తావిస్తున్నారు.

సమస్యల్లో ఉన్న వారెవరయినా సీఎంను కలవాలి అని అనుకోవడం తప్పు కాదు కానీ.. పోలీసులు అమాత్యులు  కలిసి ఎక్కడ వారు కొత్త  వివాదాలు సృష్టిస్తారో అని భయపడిపోయి భ్రమ పడిపోయి సీఎంను కనీసం కలిసే భాగ్యం కూడా ఇవ్వడం లేదు.

ఇదే ఇవాళ వైసీపీ పాలనకు అప్రతిష్ట తెచ్చిపెడుతోంది. దీనిని దిద్దుకోవడం అంత సులువు కాదు.పోలీసులూ లోకల్ లీడర్స్ కలిసి అతిని వదులుకుని ప్రవర్తిస్తే  ఆపదల్లో ఉన్నవారికి సీఎం దర్శన భాగ్యం కలగడం ఖాయం.