జగన్ పై కేసుల విచారణ వేగం పెంచండి.. సుప్రీంలో ఆర్ ఆర్ ఆర్ పిటిషన్

Sun Oct 24 2021 18:17:09 GMT+0530 (IST)

Speed ??up the trial of cases against Jagan

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై ఉన్న  ఉన్న అక్రమాస్తులు అవినీతి కేసుల్లో విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్ణీత వ్యవధిలో విచారణను పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో కేసుల విచారణ స్థితితో పాటు ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ వివరణాత్మక అఫిడవిట్ అందించాలని ప్రతివాదులను ఆదేశించాలని అభ్యర్థించారు. పదేళ్ల నుంచి ట్రయల్ కోర్టు అకారణంగా కేసు విచారణను వాయిదా వేసుకుంటూ వస్తోందన్నారు.ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల్లో విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని అశ్వినికుమార్ ఉపాధ్యా య్ కేసులో సుప్రీంకోర్టు ఏడాది కిందట ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలతో కుమ్మక్కయినట్లు జగన్ ప్రవర్తన కనిపిస్తోందని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్‌తో పాటు సీబీఐ ఈడీని ప్రతివాదులుగా చేర్చారు. సీఎం జగన్ నిర్దోషిగా బయటకు రావాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేశానని రఘురామ మీడియాకు తెలిపారు. తన పార్టీ అధ్యక్షుడిపై ఉన్న కేసులు వేగంగా.. తేలిపోతే.. నిర్దోషిగా బయటపడతారని .. ఆయన పేర్కొన్నారు. అంతకుమించి ఇందులో మరో కోణం లేదన్నారు.

ఇదిలావుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావడానికి 356వ అధికరణను ప్రయోగించడం ఒక్కటే మార్గమని రఘురామరాజు స్పష్టం చేశారు. డీజీపీ దురదృష్టకరమైన ప్రకటనలు చేస్తున్నారని ప్రజలకు ఆయన ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని ప్రశ్నించారు. సీఐని కొట్టిన వైసీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దీక్షపై సజ్జల చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఆయన వంటి సలహాదారుల వల్లనే సీఎంకు చెడ్డ పేరు వస్తోందన్నారు. సజ్జల మంచి సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని రఘురామరాజు వ్యాఖ్యానించారు.