పంజాబ్ ఎన్నికలు: మోగా నుంచి సోనూసూద్ సోదరి పోటీ

Sun Jan 16 2022 14:09:26 GMT+0530 (IST)

Sonu sood Sister From Congress Party

కాంగ్రెస్ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించింది. ఈ 86 మంది జాబితాలో కొన్ని ప్రముఖ పేర్లు ఉన్నాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం కేటాయించగా సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరడంతో ఆమెకు కూడా టిక్కెట్ దక్కింది. మోగా నియోజకవర్గం నుంచి మాళవిక సూద్ పోటీ చేయనుంది. మాన్సా నియోజకవర్గానికి గాయకుడు సిద్ధూ మూసేవాలా ఎంపికయ్యారు.

మాళవిక రాజకీయ అరంగేట్రం చేస్తుండడంతో చాలామంది దృష్టి ఆమెపైనే ఉంది. ఆమె కాంగ్రెస్‌లో చేరినప్పుడు నటుడు సోనూసూద్ ఆమెకు తోడుగా నిలిచారు. కానీ సోనూసూద్ రాజకీయాలకు దూరంగా ఉండాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆమె సోదరి కోసం తాను ప్రచారం చేయబోనని కూడా అతను స్పష్టం చేశాడు.

తన దాతృత్వ సేవా పనికి ఇప్పటికే దేశవ్యాప్తంగా  సోనూ సూద్ భారీ ప్రశంసలు అందుకున్నాడు. అతని రాజకీయ అరంగేట్రానికి కూడా చాలా మంది ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే సోనూ తన సోదరి ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.

పంజాబ్ ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకం కావడంతో ఆ పార్టీ తమ అభ్యర్థులను జాగ్రత్తగా ప్రకటిస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన తొలి జాబితా నుంచి ఎలాంటి అపశృతి చోటు చేసుకోలేదు. మిగిలిన అభ్యర్థులెవరో వేచిచూడాల్సిందే.

పంజాబ్ అసెంబ్లీలో 117 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఫలితాలు మార్చి 10 2022న ప్రకటించబడతాయి.