Begin typing your search above and press return to search.

పొత్తులపై సోము వీర్రాజు సంచలన ప్రకటన!

By:  Tupaki Desk   |   24 Jan 2023 9:14 PM GMT
పొత్తులపై సోము వీర్రాజు సంచలన ప్రకటన!
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ–జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చెబుతూ వస్తున్నారు. 2014లో పోటీ చేసినట్టే జనసేన–టీడీపీ– బీజేపీ కలసి పోటీ చేయాలనేది పవన్‌ లక్ష్యంగా ఉంది.

అయితే బీజేపీ మాత్రం వైసీపీ, టీడీపీ రెండూ అవినీతి పార్టీలేనని చెబుతోంది. అంతేకాకుండా రెండుపార్టీలు కుటుంబ పార్టీలని విమర్శలు చేస్తోంది. అందువల్ల ఈ రెండు పార్టీలతో కలసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది.

తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సంచలన ప్రకటన చేశారు. తాము జనసేన పార్టీతో కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీతో కానీ, టీడీపీతో కానీ ఎలాంటి పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఈ మేరకు భీమవరంలో జరగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తేల్చేశారు.

జనసేనతో పొత్తుపై కొత్తగా తీర్మానం చేయాల్సింది ఏమీ లేదని సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ నాయకులను తమ వైపుకు తిప్పుకునేందుకు టీడీపీ, వైసీపీ ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బలవంతపు పొత్తులు ఎక్కడ ఉండవన్నారు.

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారంపైనా సోము వీర్రాజు స్పందించారు. ప్రస్తుతానికి కన్నా బీజేపీలోనే ఉన్నారన్నారు. భీమవరంలో సమావేశాలకు రాలేకపోతున్నానని ఆయన తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు.
కాగా భీమవరంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశం పలు తీర్మానాలు చేసింది. వైసీపీ అథోగతి పాలనపై పోరాటం చేయాలని తీర్మానించింది. అలాగే కేంద్ర పథకాలకు ముఖ్యమంత్రి, ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేర్లు పెట్టుకోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది.

టీడీపీ, వైసీపీలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలని నిర్ణయించింది. బీజేపీని నిర్వీర్యం చేయాలని టీడీపీ, వైసీపీ కుట్ర చేస్తున్నాయన్నారు. ఆ పార్టీల కుట్రలను బీజేపీ చూస్తూ ఊరుకోబోదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

మరోవైపు ఇవాళ తెలంగాణలోని కొండగట్టు వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ సైతం బీజేపీతో పొత్తు కొనసాగుతుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. వారు కాదంటే ఒంటరిగా అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో భీమవరంలో బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు కూడా జనసేనతోనే తమ పొత్తు కొనసాగుతుందంటూ పొత్తులపై స్పష్టత ఇచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.