చంద్రబాబు వచ్చి మా కాళ్లు పట్టుకున్నాడు: సోము వీర్రాజు

Sat Oct 31 2020 23:30:48 GMT+0530 (IST)

Chandrababu came and grabbed our legs: Somu Veerraju

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే దూకుడుగా ముందుకెళుతున్న సోము వీర్రాజు అధికార ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలతో హీట్ పుట్టిస్తున్నారు. తాజాగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.చంద్రబాబును ఓ బురదపాముతో పోల్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అప్పటికప్పుడు మాట మార్చడం.. అవసరమైతే కాళ్లు కూడా పట్టుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఒకసారి బీజేపీతో పొత్తు వద్దని చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారని.. వెంటనే సాయంత్రానికి చంద్రబాబు మాట మార్చేశాడని.. వచ్చి మాకాళ్లు పట్టుకున్నాడని హాట్ కామెంట్స్ చేశారు.

చంద్రబాబు తాచుపాము కాదని.. బుదరపాము అని.. చంద్రబాబు నైజం ఇలా ఉంటుందని.. అనేక మందిని వాడుకొని వదిలేశాడని సోము వీర్రాజు మండిపడ్డారు.రాజకీయ చదరంగంలో చంద్రబాబుకు ఇష్టమైన ఆట ఇదేనని అన్నారు.

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత గద్దె బాబూరావు తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోము వీర్రాజు చంద్రబాబును బురదపాముతో పోల్చుతూ ఆయన తీరును కడిగేశారు.

నాడు ఎన్టీఆర్ రాజకీయాల నుంచి వైదొలిగి తప్పుకుంటానంటే అద్వానీ వాజ్ పేయి రంగంలోకి దిగి ఆయనను రాజకీయాల్లో కొనసాగేలా చేశారని.. చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ ను అవమానించి సీఎం సీటు నుంచి దించేశాడని.. వెన్నుపోటు పొడిచాడని టీడీపీ కార్యకర్తలే ఏ పార్టీలో ఉండాలో నిర్ణయించుకోవాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు.