Begin typing your search above and press return to search.

చిరుతో సోము భేటి.. బీజేపీలోకి తీసుకొస్తాడా?

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:35 PM GMT
చిరుతో సోము భేటి.. బీజేపీలోకి తీసుకొస్తాడా?
X
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాద్ వచ్చి మెగాస్టార్ చిరంజీవిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాపు సామాజికవర్గానికి చెందిన వీరిద్దరూ భేటి కావడం కొత్త ఊహాగానాలకు తెరలేస్తోంది.

రాజకీయాల నుంచి రిటైర్ అయిన చిరంజీవిని సోము మర్యాదపూర్వకంగానే కలిశాడని ఒక ప్రకటన విడుదలైంది. చిరంజీవి ఈ సందర్భంగా శాలువ కప్పి ఓ బొకే ఇచ్చి సత్కరించాడని అంటున్నారు.

అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవకుండా ఆయన అన్న రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని సోము వీర్రాజు కలవడం హాట్ టాపిక్ గా మారింది. కాపు సామాజికవర్గాన్ని అంతా ఒక్కతాటిపైకి తేవాలనే లక్ష్యంగానే సోము పావులు కదుపుతున్నట్టు అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

మర్యాదపూర్వకంగా కలిశానని చెబుతున్నా.. సమ్ థింగ్ ఏదో ఈ భేటి వెనుక ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. సోము వీర్రాజు.. చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ను బీజేపీలోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు. పవన్ ను ఒప్పించడానికి చిరంజీవినే రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోందని చెబుతున్నారు.

మోడీ చెబితే పవన్ కళ్యాణ్ ఎలాగూ కాదనరు. దీంతో చిరుతో నరుక్కురావాలని చూస్తున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు, సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పవన్ ని 2014లో మోడీ దగ్గరకు తీసుకెళ్లింది సోమూనే. దీంతో పవన్ తో ఇప్పటికే సోముకు సంబంధాలున్నాయి. ఇప్పుడు చిరును కూడా లాగేసి ఏపీలో బీజేపీ బలోపేతం కోసం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనివెనుక ఢిల్లీ స్కెచ్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.