ఆ సామెతను ఫాలో అయితే కేసీఆర్ కు కష్టాలు దూరం

Wed Sep 11 2019 10:57:44 GMT+0530 (IST)

Solution For KCR Facing Problems with TRS party Leaders

మొగుడు కొట్టినందుకు కాదు.. తోడుకోడలు నవ్వినందుకు ఎక్కువ బాధ అన్న సామెత గుర్తుందా? సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితి గులాబీ నేతల్లో నెలకొందట. ఆ మాటకు వస్తే.. పదవులు రానందుకు నేతలకు బాధ లేదట. మరి.. దేనికీ అసంతృప్తి అంటే.. నాలుగు సరైన మాటలు చెప్పే వాళ్లు లేకపోవటంగా చెబుతున్నారు. ఉండేవి కొద్ది పదవులే. ఆ విషయం టీఆర్ ఎస్ నేతలకు తెలియంది కాదు.పదవులు పొందే అర్హత తమకు ఉన్నప్పటికీ అందుకు ఎన్నో సమీకరణాలు కలిసి రావాల్సి ఉంటుంది. ఆఖరి నిమిషాల్లో చోటుచేసుకునే పరిణామాలు కూడా పదవులు ఒక్కోసారి రాకుండా పోతుంటాయి. అందుకే అంటారు.. పదవులు ఉత్తినే రావు.. దానికీ లెక్క ఉందని. ఈ విషయాలన్ని టీఆర్ ఎస్ నేతలకు తెలిసినవే. సమస్యల్లా.. తమను అధినేత గుర్తించాలని కోరుకునే వారికి.. కేసీఆర్ దర్శన భాగ్యం కరువు కావటం.. ఏ సందర్భంలోనూ పిలిచి మాట్లాడని తత్త్వంతోనే అసలు ఇబ్బందంటున్నారు.

తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్నప్పుడు అధినేత ఎలా ఉన్నా.. నేతలు గమ్మున ఉంటారు. కానీ.. సీన్ ఒక్కసారి తేడా కొడితే విషయం మొత్తం మారుతోంది. మొన్నటివరకూ గులాబీ నేతలకు లేని ప్రత్యామ్నాయం ఇప్పుడు కంటి ముందు కనిపించటం.. కేసీఆర్ కంటే మోడీషాలు ఎంతన్న విషయం అర్థమవుతున్న కొద్దీ.. అధినేతపై ఉండే గుర్రును ప్రదర్శించుకోవటానికి ఏదో ఒక వేదికను తమకు అనుకూలంగా మార్చుకోవటం గులాబీ నేతల్లో ఈ మధ్యన ఎక్కువ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ ఇబ్బందులన్నింటికి పరిష్కారం పెద్ద కష్టం కాదని.. పార్టీ నేతలతో కేసీఆర్ టచ్ లో ఉండటం.. అర్హత ఉండి పదవులు రాని వారి విషయంలో కాసింత అలెర్ట్ గా ఉండి.. వారికి విషయాల్ని వివరిస్తే సరిపోతుందటున్నారు. పదవి రాకపోతే రాకపోయింది.. అరే.. నీకు ఇవ్వలేకపోతున్నాం.. నీ సంగతి మేం చూసుకుంటామన్న చిన్నపాటి భరోసా లేకపోవటమే గులాబీ నేతల గుర్రుకు అసలు కారణమని ఒక సీనియర్ నేత లోగుట్టుగా చెప్పటం చూస్తే..  అసలు సమస్య ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు.